పాత పైప్ లైన్లకు సమాంతరంగా కొత్త పైప్​లైన్లు.. 50 ఏండ్ల నాటి తాగునీటి పైప్​లైన్ ​వ్యవస్థకు బై.. బై..

పాత పైప్ లైన్లకు సమాంతరంగా కొత్త పైప్​లైన్లు.. 50 ఏండ్ల నాటి తాగునీటి పైప్​లైన్ ​వ్యవస్థకు  బై.. బై..
  • మంజీరా, సింగూరు పైప్​లైన్ల పక్కనే మరొక లైన్​ 
  • ఉస్మాన్​సాగర్​ కాండ్యూట్​ను ఆనుకుని మరొకటి..  
  • తరచూ లీకేజీలతో నీటి వృథా, సరఫరాలో అంతరాయం 
  • కొత్త లైన్ల ఏర్పాటుకు ఓకే చెప్పిన సీఎం రేవంత్​రెడ్డి
  • ‘వ్యాప్​కో’ కంపెనీకి సర్వే, డీపీఆర్​ బాధ్యతలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలోని తాగునీటి పైప్ లైన్లను ఆధునికీకరించేందుకు వాటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న భారీ పైప్​లైన్లలో చాలా వరకు కాలం తీరినవే ఉన్నాయి. 50 కిలోమీటర్ల దూరం నుంచి మంజీరా, సింగూరు వాటర్​తీసుకువస్తుండగా ఈ పైపు​లైన్లు వేసి దాదాపు యాభై ఏండ్లు దాటింది. 11 కిలోమీటర్ల దూరం నుంచి హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​నీటిని కాండ్యూట్​ద్వారా ఆసిఫ్​నగర్​లోని ఫిల్టర్​బెడ్స్​కు తరలిస్తున్నారు. ఈ కాండ్యూట్​నిజాం హయాంలో నిర్మించింది.

కాలం తీరిన పైప్​లైన్లు కావడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. తాగునీటి సరఫరాలో అంతరాయ కలుగుతోంది. ఈ క్రమంలోనే పైప్​లైన్లను మార్చాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతమున్న పైప్​లైన్లకు సమాంతరంగా కొత్త లైన్లు వేసి పాత వాటి నుంచి సరఫరా నిలిపివేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే చేసినా కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్​హయాంలో సింగూరు నుంచి నీటి సరఫరాను నిలిపివేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొత్త పైపులైన్ల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే అధికారులు సీఎం రేవంత్​దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా ఓకే చెప్పారని అధికారులు అంటున్నారు. 
  

పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితి

పైపులైన్ల లీకేజీల కారణంగా మంజీరా, సింగూరు నుంచి డ్రా చేస్తున్న నీటిలో 70 శాతమే నగరానికి తరలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఆ టైంలో సింగూరు, మంజీరా పైప్​లైన్లను 1972లో వేశారు. పూర్తిగా సిమెంట్​పైపులను వినియోగించారు. 50 ఏండ్లు కావడంతో శిథిలావస్థకు చేరాయి. ఎక్కువ ప్రెషర్​పెడితే  లీక్​అవుతున్నాయి. దీంతో ప్రెషర్​తగ్గించి 70 శాతం నీటిని మాత్రమే తరలిస్తున్నారు. ప్రస్తుతం మంజీరా నుంచి 40.52 ఎంజీడీలు, 69.07 ఎంజీడీలు, ఉస్మాన్​సాగర్​ నుంచి 22.50 ఎంజీడీలు, హిమాయత్​సాగర్​ నుంచి 10.58 ఎంజీడీలు తీసుకువస్తున్నారు. 

జంటజలాశయాల నుంచి డ్రా చేసిన నీరు కాండ్యూట్(కాలువ) ద్వారా గ్రావిటీతో ఆసిఫ్​నగర్​ఫిల్టర్​బెడ్​కు చేరుకుంటున్నాయి. దాదాపు 11 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాలువలోకి నీరు వదిలితే 30 శాతం లీకేజీలతో వృథాగా పోతోంది. అందుకే కాండ్యూట్​కు సమాంతరంగా మరో పైప్​లైన్​నిర్మించేలా ప్రతిపాదనలు చేశారు.

కొత్త టెక్నాలజీతో స్టీల్​ పైపులు

వాటర్​బోర్డు కొత్తగా సమాంతర పైప్​లైన్ల నిర్మాణానికి సంబంధించి సర్వే, డిటెయిల్డ్​ప్రాజెక్ట్​రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసేందుకు ‘వ్యాప్​కో’ సంస్థను కన్సల్టెన్సీగా నియమించిందని అధికారులు తెలిపారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వినియోగించిన కొత్త టెక్నాలజీతో ఎంఎస్​పైపులు(స్టీల్​పైపులు) ఉపయోగించి కొత్త లైన్లు వేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ సంస్థ ఇచ్చే ప్రపోజల్స్​ఆధారంగా కొత్త లైన్లను నిర్మించేందుకు ప్లాన్లు రూపొందిస్తామంటున్నారు. వ్యాప్​కో సంస్థ సర్వేలో ఎన్ని కిలోమీటర్ల మేర పైప్​లైన్​వేయాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుందన్న పూర్తి నివేదికను అందజేస్తుందని అధికారులు తెలిపారు.