సిరిసిల్లలో ఎయిర్ ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్.. ఐదుగురు రైతులు సేఫ్

సిరిసిల్లలో ఎయిర్ ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్.. ఐదుగురు రైతులు సేఫ్

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీమ్ రక్షించింది. హెలికాప్టర్ సహయంతో వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో అధికారులు, రైతులు, బాధితుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం (ఆగస్ట్ 27) భారీ వర్షం కురిసింది. వరుణుడు ఉగ్రరూపం చూపించడంతో సిరిసిల్ల జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పొలం పనుల కోసం వెళ్లిన ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు. వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేపోయారు. 

బుధవారం (ఆగస్ట్ 27) నుంచి వాగులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుకున్న కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎ను ఆశ్రయించారు. రైతులకు కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు పంపించాలని కోరారు. బండి సంజయ్ అభ్యర్థను మేరకు గురువారం (ఆగస్ట్ 28) ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను సురక్షితంగా కాపాడింది.