
ఖాళీ స్థలాలను కబ్జా చేసి కోట్లలో దందాకు తెగబడ్డారు కేటుగాళ్లు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు.. అవి కూడా వయసుమళ్లిన యజమానులకు చెందిన స్థలాలను కబ్జా చేసి బేరం పెట్టడమే వీళ్ల పని. బుధవారం (ఆగస్టు 27) ఎనిమిది మంది భూ దొంగలను అరెస్టు చేశారు SOT భువనగిరి బృందం, కీసర పోలీసులు.
హైదరాబాద్ - యాదాద్రి భువనగిరి రూట్లో గట్ కేసర్ తదితర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. వీళ్లు ఖాళీ స్థలాలను గుర్తించి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించడానికి ప్రయత్నించారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మొత్తం రూ.5 కోట్లు విలువ చేసే స్థలాలను రక్షించారు పోలీసులు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీగుడెం అరవింద్ అలియాస్ తిల్లూ (ప్రధాన నిందితుడు), సంపంగి సురేష్ అలియాస్ పవన్, ఈగ హరిప్రసాద్, చెక్కల సోమనాథ్ అలియాస్ సోమయ్య, కొట్ల నాగేంద్ర ప్రసాద్ అలియాస్ రఘునాథ్ రెడ్డి, మిర్ మొహమ్మద్ హుస్సేన్ లను అరెస్టు చేశారు. మరో 13 మంది పరారీలో ఉన్నారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసిన వస్తువులులాప్‌టాప్, ప్రింటర్లు, స్కానర్, హార్డ్ డ్రైవ్, పెన్‌డ్రైవ్స్, నకిలీ ముద్రలు స్వాదీనం చేసుకున్నారు. నిందితులు రాంపల్లి, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను గుర్తించి EC, పాత డాక్యుమెంట్స్ సేకరిస్తారు. నకిలీ డెత్ సర్టిఫికేట్లు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు (వారసులు), సేల్ డీడ్లు తయారు చేసి మోసపూరితంగా అమ్మడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.