
Market Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం ఆరంభ ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలను నమోదు చేశాయి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతుండగా.. సెన్సెక్స్ 550 ప్లస్ పాయింట్ల నష్టంలో ఉంది. వాస్తవానికి నిన్న పండుగ సెలవు తర్వాత ఇవాళ ఓపెన్ అయిన మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ అమలులోకి రావటంపై భయాలు ఇన్వెస్టర్లను ఆవరించాయి. దీంతో ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ సహా మరిన్ని రంగాల షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిని చూసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఉదయం నష్టాల నుంచి మార్కెట్లు తేరుకోవటానికి వెనుక ఉన్న కీలకమైన అంశాలు అలాగే మార్కెట్లలో ఇన్వెస్టర్ల భయాలను తగ్గించి సానుకూల సెంటిమెంట్లను రేకెత్తించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ప్రధాని మోడీ పర్యటన:
భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా, జపాన్ పర్యటనకు వెళుతుండటం ఒక సానుకూల అంశంగా మార్కెట్లు చూస్తున్నాయి. అమెరికా భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలను ప్రకటించిన సమయంలో మోడీ వ్యూహాత్మకంగా బిజినెస్ ట్రిప్ అలాగే వైరం ఉన్నప్పటికీ చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇన్వెస్టర్లు సానుకూల అంశాలుగా పరిగణిస్తున్నారు. ఈ చర్యలు భారత ఎగుమతులను ఇతర దేశాలకు డైవర్డ్ చేసేందుకు దోహదపడటంతో పాటు ప్రపంచ వాణిజ్య ప్రమాదాలను తగ్గిస్తాయని భావిస్తున్నాయి మార్కెట్లు.
2. అమెరికా సుంకాలు తాత్కాలికమే:
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడ్ ప్రకటించిన అదనపు 25 శాతం సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇది ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని కలిగించినప్పటికీ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ చేసిన కామెంట్స్ తర్వాత ఇవి తగ్గాయి. త్వరలోనే ఉద్రిక్తతలు పరిష్కరింపడతాయని చేసిన కామెంట్స్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపాయి. ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగవని, స్వల్ప సమయంలోనే పరిష్కరింపబడతాయని బ్రోకరేజ్ సంస్థలు కూడా భావిస్తున్నాయి. అంటే టారిఫ్స్ ఎఫెక్ట్ తాత్కాలికమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
3. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల జోరు:
ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఆ పరిస్థితులను సరిచేసేందుకు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ క్రమంలో 6వేల 516 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మేయగా తగ్గేదేలే అన్నట్లు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7వేల కోట్లకు పైగా విలువైన స్టాక్స్ కొనటం మార్కెట్ల స్థిరీకరణకు దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
4. జెఫరీస్ జీఎస్టీ రిపోర్ట్:
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ భారత ప్రభుత్వం చేపడుతున్న జీఎస్టీ సంస్కరణలపై సానుకూలతలను నివేధించింది. జీఎస్టీ తగ్గింపులతో భారత ఆటో రంగంలో కొత్త ఉత్తేజం వస్తుందని ప్రధానంగా టూవీలర్స్ అలాగే చిన్న కార్లకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. దీంతో ఆటో రంగంలోని హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా సహా ఇతర స్టాక్స్ నేడు లాభాల్లో దూసుకుపోతున్నాయి.