త్వరలో బ్యాంకర్లతో హైడ్రా భేటీ

త్వరలో బ్యాంకర్లతో హైడ్రా భేటీ
  • అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వద్దొని సూచించే చాన్స్​
  • లోన్లు ఇవ్వకపోతే ఇలాంటి నిర్మాణాలు ఉండవని ఆలోచన
  • ఇప్పటికే కూల్చిన అక్రమ ఇండ్లలో చాలా వాటికి లోన్లు.. నష్టపోయిన సామాన్యులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలను అడ్డుకునేందుకు హైడ్రా అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నది. ఓ వైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే.. మరో వైపు ప్రజలు ఇటువంటి అక్రమ నిర్మాణాలను కొనవద్దని సూచనలు చేస్తున్నది. ఇండ్లను, ఫ్లాట్లను కొనేందుకు ఎక్కువ శాతం మంది లోన్ల కోసం బ్యాంకులనే ఆశ్రయిస్తారు. ఎంతో కొంత డౌన్ పేమెంట్ చెల్లించి నెల నెలా కిస్తీలు కట్టుకునే వారే ఎక్కువగా ఉంటారు.

ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో హైడ్రా ఓ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలాలు, కుంటలు, చెరువుల  సమీపంలో ఉన్న నిర్మాణాలకు బ్యాంకర్లు లోన్లు ఇచ్చే ముందు అన్ని విధాలుగా చెక్ చేసుకునేలా హైడ్రా కమిషనర్ పలు సూచనలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కూల్చిన ఇండ్లలో చాలా ఇండ్లు లోన్లపై కొన్నవే ఉన్నాయి.

చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అధికారులు అడ్డదారిలో అనుమతులు ఇస్తుండడం, వాటి ఆధారంగా బ్యాంకర్లు లోన్లు ఇస్తుండడం తలనొప్పి వ్యవహారంలా మారింది. దీంతో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇచ్చేముందే బ్యాంకర్లు పకడ్బందీగా వెరిఫై చేసుకుంటే సమస్యలుండవని హైడ్రా భావిస్తున్నది. చెరువుల సమీపంలో నిర్మాణాలకు బ్యాంకర్లు లోన్లు ఇచ్చే సమయంలో హైడ్రాను సంప్రదిస్తే వారికి ఎన్​వోసీ మాదిరిగా హైడ్రా ఏమైనా ఇస్తుందా? లేక ఇంకేమైనా సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుందా? అన్నది బ్యాంకర్ల సమావేశం తర్వాత క్లారిటీరానుంది.

అడ్డదారిలో అనుమతులు ఇవ్వడంతో..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ, ఆయా మున్సిపాలిటీల అధికారులు అడ్డదారిలో అనుమతులు ఇస్తున్నారు. దీంతోనే ఆయా ఇండ్లను కొంటున్న వారికి ఇబ్బందులు తప్పడంలేదు. చందానగర్ లోని ఈర్ల చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన గ్రౌండ్ ప్లస్ త్రీ బిల్డింగ్, గ్రౌండ్ ప్లస్ 4 భవనాలు రెండింటినీ హైడ్రా కూల్చివేసింది.

ఈ బిల్డింగులకు జీహెచ్ఎంసీ అధికారులు అప్పట్లో అడ్డదారిలో అనుమతులిచ్చినట్లు హైడ్రా గుర్తించింది. సదరు అధికారులపై కేసులు కూడా నమోదు చేసింది. కానీ, అందులో ఫ్లాట్లు కొందామని బుక్​చేసుకుని డబ్బులు ఇచ్చిన వారే ఇబ్బందులు పాలయ్యారు.

ఇక్కడ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. అప్రూవల్​దశలో ఉంది. ఇక మల్లంపేట్ లోని కత్వ చెరువులో కూల్చిన విల్లాల్లో  13 మంది లోన్లు తీసుకునే కొన్నారు. ఇట్ల సామాన్యులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకునేందుకు బ్యాంకర్ల సమావేశం ఉపయోగపడుతుందని హైడ్రా భావిస్తున్నది.  
అక్కడ సామాన్యులకు తప్పిన లోన్​ తిప్పలు

ఇటీవల ఓఆర్ఆర్​పరిధిలో హెచ్ఎండీఏ ఇచ్చిన కొన్ని ఇండ్లు, అపార్ట్​మెంట్లకు దొడ్డిదారిలో అనుమతులు ఇచ్చారంటూ  హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా విచారణ జరిపి.. ఇచ్చిన అనుమతులు అన్నీ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి రీ వెరిఫై చేసి వెంటనే రద్దు చేయాలని హెచ్​ఎండీఏకు లెటర్​రాసింది.

దీంతో బ్యాంకు లోన్లకు వెళ్లకముందే గండం నుంచి గట్టెక్కారు. లేకపోతే భారీ స్థాయిలో నష్టపోయేవారే. ఇలాంటి పరిస్థితులు రిపీట్​ కావొద్దని హైడ్రా బ్యాంకర్లతో మీటింగ్​పెట్టి వారికి పలు సూచనలు చేయబోతున్నట్టు తెలిసింది.