యూపీలో వరద బాధితులను కసురుకున్న కలెక్టర్

యూపీలో వరద బాధితులను కసురుకున్న కలెక్టర్
  • సరుకులు అవసరం ఉన్నోళ్లు వచ్చి తీస్కెళ్లండి

లక్నో: ‘ఇంటింటికీ తిరిగి సరుకులు అందించడానికి మేమేం జొమాటో సర్వీస్​ చేయట్లేదు.. అవసరమున్నోళ్లు పునరావాస కేంద్రానికి వచ్చి సరుకులు తీస్కోండి’ అంటూ వరదబాధితులను ఉద్దేశించి కలెక్టర్​ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఉత్తరప్రదేశ్​లోని అంబేద్కర్​ నగర్​ జిల్లా కలెక్టర్​ ఈ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇటీవలి వర్షాలకు యూపీలోని పలు జిల్లాలు జలమయం అయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్​ అధికారులను అలర్ట్​ చేశారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తూ బాధితులకు సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్​ నగర్​ కలెక్టర్​ శామ్యూల్​ పాల్​అధికారులతో కలిసి వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

అంబేద్కర్​నగర్​లోని ఓ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్​ సందర్శించిన సమయంలో రికార్డుల్లో చూపిన సంఖ్య కన్నా జనం తక్కువగా ఉన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిందే బాధితుల కోసమని, అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఓ డాక్టర్​ కూడా అందుబాటులో ఉండి అవసరమున్నోళ్లకు వైద్యం చేస్తారని వివరించారు. ఉదయంపూట బాధితులందరూ ఒక్కచోట చేరి, ఆ రోజు ఎంతమందికి ఏ టైముకు ఆహారం అవసరమో నిర్వాహకులకు చెప్పాలని సూచించారు. అవసరమున్నోళ్లు కేంద్రానికే వచ్చి ప్రభుత్వం అందించే సాయం పొందాలని, ఇంటింటికీ తిరిగి సరుకులు అందజేయడానికి ప్రభుత్వమేమీ జొమాటోను నడపట్లేదని కలెక్టర్​ పాల్​ తేల్చిచెప్పారు. ఉదయం పూట ఉన్నోళ్లకు మాత్రమే సరిపడా ఆహారం తయారుచేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్​ మాట్లాడుతుండగా స్థానికులు వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడంతో వైరల్​గా మారింది.