నేను గెలిస్తే కేసీఆర్ నేలమీదకొచ్చి.. ప్రజల మధ్యకొస్తాడు

నేను గెలిస్తే కేసీఆర్ నేలమీదకొచ్చి.. ప్రజల మధ్యకొస్తాడు
  • ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దగ్గర గౌరవం పెరుగుతుంది
  • అందరికీ కేసీఆర్ అపాయిమెంట్ దొరుకుతుంది: మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: ‘‘హుజూరాబాద్ లో నేను గెలిస్తే కేసీఆర్ నేలమీదకొచ్చి.. ప్రజల మధ్యకొస్తారు..ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దగ్గర గౌరవం పెరుగుతుంది.. కేసీఆర్ అపాయిమెంట్ దొరుకుతుంది.. ఈటల రాజేందర్ ను గెలిపించుకోవడమంటే మమ్మల్ని మేము గెలిపించుకున్నట్లేనని హుజురాబాద్ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు.. ’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను గెలవాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని, ఎన్.ఆర్.ఐ వాళ్లు కూడా ఇక్కడి ప్రజలకు ఫోన్ చేసి ఈటలనే గెలిపించాలని కోరుతున్నారని, ఓటుకు లక్ష పంచినా... ఇంకే ప్రభుత్వ లబ్ధి లభించినా... నీవల్లే వచ్చాయని ప్రజలే నాకు గుర్తు చేస్తున్నారని, మేమున్నామంటూ నాకు భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ మధువని గార్డెన్ లో కాట్రపల్లికి చెందిన పలువరు బీజేపీలో చేరారు. పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా హుజురాబాద్ లో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 
40 ఏళ్ల కింద తెలంగాణ పల్లెల్లో వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ల కింద పల్లెల్లో ఉన్న వాతావరణం.. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో హుజురాబాద్ లో మళ్లీ కనిపిస్తోందని ఈటల రాజేందర్ విమర్శించారు. వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులు, ఒక్కో పోలీసు స్టేషన్ కు ఏసీపీని ఇంచార్జీగా పెట్టి ప్రతి ఇంటిపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరగానే వాళ్ల ఫొటోలు తీసుకెళ్లి పోలీసులు టీఆర్ఎస్ నేతలకు ఇస్తున్నారని, నాతో కలిసి తిరుగుతున్న వారిని బెదిరించి వాళ్లవైపు తిప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ధీరుడు బరిగీసి పోరాడుతాడు.. రండలాంటి వాళ్లే కుట్రలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉద్యమమే ఉండేదా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉద్యమమే ఉండేదా..? మనం ఉద్యమించేవాళ్లమా...? అసలు తెలంగాణ వచ్చేదా ? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఫించన్లు ఇస్తున్నం, రేషన్ బియ్యం, గొర్రెలు, దళితబంధు ఇస్తున్నాం కాబట్టి మా కండువా మీ మెడలో ఉండాలి, మీ ఇంటిపై మా జెండా ఎగరాలని, మాకే ఓటేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్ననాడు.. కాంగ్రెస్ లో తిరిగేవారికి రేషన్ బియ్యం ఇవ్వలేదా?  అంగన్ వాడీ కార్యకర్తలను కూడా తమ పార్టీకే పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని, కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ రావు కూడా... తన సంస్థలో పనిచేయాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని బెదిరిస్తున్నారని, హుజురాబాద్ లో ఏ పనిచేయాలన్నా.. టీఆర్ఎస్ ఉంటేనే చేసుకోనిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. 
దిక్కుమొక్కులేని జనం.. ఒక్కక్క అగ్నికణమై వారి సత్తా చూపిస్తారు 
ఇలాంటి బెదిరింపులు ఎల్లకాలం సాగవు, దిక్కుమొక్కులేని జనం.. ఒక్కక్క అగ్నికణమై వారి సత్తా చూపిస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. హుజురాబాద్ నీ అబ్బా జాగీరా కొడుకా... అని ఆయన నిలదీశారు. పోలీసులైనా, ఉద్యోగులైనా చట్టానికి, ధర్మానికి లోబడి పనిచేయండి, మీరంతా కేసీఆర్ చుట్టాలు, జీతగాళ్లు కాదు.. వాళ్లకు చుట్టాల్లాగా పనిచేస్తే రేపు ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చేది కేవలం ఐదేళ్ల కోసమే.. ఎల్లకాలం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఐదేళ్లు అధికారం ఇస్తేనే ఇంత చేస్తున్నారు... పదేళ్లు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అని సూచించారు. 
ఇక్కడొచ్చి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ముందు మీ నియోజకవర్గాల్లో ఇప్పించుకోండి
ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు.. వాళ్ల నియోజకవర్గాల్లో మాత్రం ఇక్కడొచ్చే పథకాలేవి ఇప్పించలేరని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. కానీ నేను అదృష్టవంతున్ని... నేను రాజీనామా చేయడం వల్లే నా ప్రజలకు ఇవన్నీ అందుతున్నాయి, నేను వాళ్ల రుణం తీర్చుకుంటున్నట్లు భావిస్తున్నానన్నారు. గద్దల్లా వాలిపోయి ఇక్కడ ఏ పనంటే ఆ పని చేస్తున్న నాయకులు.. ఇదే పని రాష్ట్రమంతా చేయాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ ప్రజలారా ఇవన్నీ చేస్తున్నది మీ ఓట్లపై ప్రేమతోనే తప్ప.. మీపై ప్రేమతో కాదని గుర్తుంచుకోవాలని కోరారు. 
ప్రజలను మోసం చేసి నన్ను ఓడించాలని చూస్తున్నాడు
ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆత్మగౌరవ బావుటా ఎగురేసి.. 20 ఏళ్ల ఉద్యమ చరిత్రలో గుర్తింపు పొంది ఏకు మేకవుతాడని కేసీఆర్ భావించారని, అందుకే ఏ ప్రజలైతే నా వెంట ఉన్నారో.. ఆ ప్రజలను మోసం చేసి.. నన్ను ఓడించాలని చూస్తున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేల్లారా, మంత్రుల్లారా...మీకా శక్తి లేదు అని గుర్తించాలన్నారు. 
ప్రజల కన్నీళ్లకు ఆసరవుతా
కేవలం మాటలు చెప్పి పోయే నాయకున్ని కాదు నేను, ప్రజల కన్నీళ్లకు ఆసరా అవుతానని మాజీ మంత్రి ఈటల స్పష్టం చేశారు. నన్ను ఓడించడం సాధ్యం కాదనే... ఇన్ని కోట్లు ఇక్కడ కుమ్మరిస్తున్నాడు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. జీతాలిచ్చేందుకు డబ్బులు లేకున్నా.. రాష్ట్ర ఖజానా అంతా ఇక్కడ ఖర్చు చేస్తూ .. మోసపు ప్రమాణాలు చేయించుకుంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూలీ పనిచేసో, ఆస్తులమ్మో.. మనకు ఇవన్నీ ఇవ్వడం లేదని, మనం కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బులే ఇవన్నీ అననారు. 
ప్రజల డబ్బుతో కేసీఆర్ సోకులు చేస్తున్నాడు
ప్రజల డబ్బుతో కేసీఆర్ సోకులు చేస్తున్నాడని, కులమతాలతో, పార్టీలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈసారి కేసీఆర్ నియంతృత్వాన్ని, అహంకారాన్ని, రాచరికపోకడలను బొందపెట్టాలని మాజీ మంత్రి ఈటల పిలుపునిచ్చారు. ప్రజలంతా అప్రమత్తంగా, చైతన్యవంతంగా ఉండాలని సూచించారు. 2023 వరకు నేనే ఎమ్మెల్యేగా ఉండాలన ప్రజలు నన్ను గెలిపించారు, కానీ కారు గుర్తుపై గెలిచావు కాబట్టి  దమ్ముంటే రాజీనామా చేయమని వాళ్లు నన్ను డిమాండ్ చేశారు, వాళ్లు మాత్రం కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన వాళ్లను రాజీనామా చేయించకుండానే వాళ్ల పార్టీలో చేర్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నేను ఇజ్జత్ ఉన్నోన్ని కాబట్టి.. రాజీనామా చేసి మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మళ్లీ వచ్చానని ఈటల రాజేందర్ తెలిపారు.