దళితులకు మూడెకరాలిస్తానని పంగనామాలు పెట్టిండు

దళితులకు మూడెకరాలిస్తానని పంగనామాలు పెట్టిండు
  • పేద దళితులకు 3 ఎకరాలు చొప్పున భూమి ఇస్తానని పంగనామాలు పెట్టాడు
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాల్లో దళితబంధు ఇప్పించే దమ్ముందా..? 
  • ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ధర్మమే గెలుస్తుందన్న తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి
  • నా గెలుపు.. హుజూరాబాద్ ప్రజలందరి గెలుపు
  • మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్

కరీంనగర్: ‘‘తెలంగాణ వస్తే దళితుడే సీఎం.. లేదంటే తల నరుక్కుంటానని కేసీఆర్ మాట తప్పిండు. పేద దళితులకు 3 ఎకరాలు చొప్పున భూమి ఇస్తానని పంగనామాలు పెట్టాడు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాల్లో దళితబంధు ఇప్పించే దమ్ముందా..? ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ధర్మమే గెలుస్తుందన్న తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి.. నా గెలుపు.. హుజూరాబాద్ ప్రజలందరి గెలుపు..’’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం జమ్మికుంటలో జరిగిన దళిత ఆత్మీయ సత్కార సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్  పాల్గొన్నారు. 
చరిత్రలో ఎప్పుడూ ప్రజలు పోరాటం చేసినవాళ్లనే గుర్తుంచుకుంటారు 
చరిత్రలో ప్రజలు ఎప్పుడూ పోరాటం చేసిన వాళ్లనే గుర్తుంచుకుంటారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా వారికి ఆ పేరు దక్కలేదు, టీఆర్ఎస్ కే తెలంగాణ తెచ్చిన పేరు వచ్చిందని ఆయన అన్నారు. దళిత బంధు విషయంలోనూ పోరాటం చేస్తున్న మనకే పేరువస్తుంది తప్ప.. కేసీఆర్ కు మాత్రం రాదని ఆయన పేర్కొన్నారు. దళితుల ఓట్లకోసమే దళితబంధు వస్తుంది కాబట్టి.. దానికి కారణం  ఈటల రాజేందర్  మాత్రమేనని  గుర్తుంచుకుంటారని చెప్పారు. నాయకులకు సొంత ప్రయోజనాలుండొచ్చు.. కానీ ఏదైనా అంశంలో బరిగీసి కొట్లాడే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందన్నారు. అందుకే  నాతో పాటు ఉన్న నాయకులంతా వెళ్లిపోయినా.. ప్రజలంతా నా వెంటే ఉన్నారని, పాలకుడు ఎప్పుడు కూడా ప్రజలపై ప్రేమతో సమస్యలు పరిష్కరించరు, దళిత బంధు కూడా అలాంటిదేనన్నారు. హుజురాబాద్ దళితుల ఓట్లు కొల్లగొట్టి.. నా గొంతు పిసికేందుకే ఈ పథకం తెచ్చాడని ఆరోపించారు. ‘‘38 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్.. ఎన్నోసార్లు దళితులే పేదరికంలో ఉన్నారని ఆయనే ఎన్నోసార్లు చెప్పారు.. దళితుల చేతిలో అధికారం ఉంటేనే పరిష్కారం దొరకుతుందని చెప్పిన వ్యక్తి కూడా కేసీఆరే.. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడేనని, తల నరుక్కుంటా తప్ప మాట తప్పనన్నాడు. కానీ తలనరుక్కోకుండానే మాట తప్పాడు.. మూడు ఎకరాల భూమి అన్నప్పుడే.. పంచేందుకు భూములు లేవని ఆనాడే చెప్పాం.. భూములు సోషల్ స్టేటస్ గా, ఓ ధైర్యంగా భావిస్తారు.. అలా ఇస్తే మంచిదేనని భావించాం..’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని 15 లక్షల మంది దళితులకు 3 ఎకరాలు చొప్పున ఇవ్వాలి 
రాష్ట్రంలో 15 లక్షల పేద దళితులున్నారని, వారందరికీ మూడెకరాల భూమి ఇవ్వాలంటే 45 లక్షల ఎకరాలు కావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇది సాధ్యం కాదని తెలిసే.. కేసీఆర్ ఆ హామీ ఇచ్చినట్లుందన్నారు. పూర్వం రాజుల కోటల చుట్టూ.. కందకాలు తవ్వించి నీళ్లు నింపి మొసళ్లను రక్షణగా వదిలేవారు, అలాంటి కోటలపై దాడి చేయాలంటే ఉడుముల మూతికి తేనె రాసి కోటగోడపైకి తాళ్లతో విసిరి శత్రువులు ప్రవేశించేవారు, ఇప్పుడు హుజురాబాద్ లో గెలిచేందుకే ఉడుముల మూతికి తేనే రాసినట్లుగా దళితబంధు అంటున్నారని ఈటల తెలిపారు. నాలుగేళ్లలో రాష్ట్రమంతటా దళిత బంధు అంటున్నాడు. ఈ హామీ ఎవరిని మోసం చేసేందుకు ? నాలుగేళ్లు కాదు కదా.. 40 ఏళ్లైనా.. దళితులందరికీ ఇచ్చేంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవన్నారు. నేను ఆర్థిక మంత్రిగా కూడా పని చేశాను, నాకు బడ్జెట్ గురించి బాగా తెలుసు, ఏటా 60 వేల కోట్లు అప్పులకు, మరో 40 వేల కోట్లు జీతభత్యాలకు, 15 వేల కోట్లు రైతుబంధు, మరో 15 వేల కోట్లు కరెంట్, బియ్యం సబ్సిడీ కోసం, 10 వేల కోట్లు ఇతర ఖర్చులకు పోగా బడ్జెట్ లో మిగిలేదెంత ? మీ దగ్గర నిజంగానే డబ్బులుంటే... మధ్యాహ్నం భోజనం వండే వంటవాళ్లకు ఎందుకు బిల్లులు ఇవ్వడం లేదు అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాంట్రాక్టు వర్కర్లకు, ఇతర వర్కర్లకు ఎందుకు జీతాలీయడం లేదని ఆయన నిలదీశారు.  
దళితులకు సాయం చేస్తామంటే మేమెవరము ఆపము
దళితులకు సాయం చేస్తామంటే మేమెవరమూ ఆపమని, ఆపాలని అనుకోమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆపితే మీరే కోర్టులో కేసులు వేసి ఆపిస్తావు కావచ్చు, కానీ దళితుల కష్టాల తెలిసినోళ్లెవరూ ఆ కుట్రలు చేయరని ఆయన పేర్కొన్నారు. హుజురాబాద్ లో ఇప్పుడు ఏ సమస్య లేకుండా అన్ని తీర్చుతున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.   
మంత్రులు, ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గాలో దళితబంధు ఇప్పించే దమ్ముందా..?
నామీద విమర్శలు చేస్తున్న మంత్రుల్లారా, ఎమ్మెల్యేల్లారా? మీ నియోజకవర్గాల్లో దళితబంధు ఇప్పించే దమ్ము మీకుందా? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.  మాలాగే కుల సంఘాలు, ఇతర సమస్యలు తీర్చే దమ్ము మీకుందా? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ సీఎంగా కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమని ఇప్పటికే నేను చెప్పాను, 
నాతో తిరుగుతున్న వారికి ఏదైనా ప్రభుత్వ పరంగా ఉద్యోగమో, కాంట్రాక్టు ఉద్యోగమో ఉంటే వారిని బెదిరిస్తున్నారు, ప్రతి ఊరిలో మఫ్టీలో ఉన్న పోలీసులను తిప్పుతున్నారు, టిఫిన్ చేస్తుండగా నాతో పాటు ఫోటో తీయించుకున్న ఓ నాయకుడు సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టుకుంటే.. ఓ నాయకుని బెదిరించి కండువా కప్పారని విమర్శించారు. రెండు రోజులు నాతో ఎవరైనా తిరిగితే చాలు.. వాళ్లు గాలం వేసి పట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి పాలకులు ఇలా చేసి ఉంటే ఒక్క నాయకుడైనా మిగిలేవాడా?
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం కేసీఆర్ హుజూరాబాద్ లో చేస్తున్నట్లు వ్యవహరించి ఉంటే మనకు ఒక్క నాయకుడైనా మిగిలి ఉండేవాడా..? కేసీఆర్ చెప్పగానే బానిసల్లాగా పనిచేస్తున్న అధికారుల్లారా, పోలీసుల్లారా, నాయకులారా.. ఓసారి ఆలోచించండి. నాకు ఇబ్బంది అవుతుండొచ్చు .. కానీ ఇది ఇంతటిదో ఆగదని గుర్తుంచుకోండి. ఏనాడో ఓనాడు మిగతా నేతలకు కూడా నాలాంటి పరిస్థితే వస్తే మీరు గిలగిల కొట్టుకుంటారు..’’ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. హుజురాబాద్ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి మేము తట్టుకుంటున్నాము కానీ.. మీకు ఈపరిస్థితి వస్తే మాత్రం ఖతమై పోతారని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 
హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు.. బెదిరిస్తే ‘‘ఏందిరా’’ అంటారు 
హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప.. బెదిరిస్తే మాత్రం “ఏందిరా” అని అంటారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందరికీ పది లక్షలు వస్తాయన్న నమ్మకం కనిపించడం లేదు, ఒకవేళ వచ్చినా.. దానికి కారణం ఈటల రాజేందర్ అని గుర్తుంచుకోండి అని ఆయన సూచించారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకండి. మీకోసం నేనున్నానని మరిచిపోకండిని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరివేసిన బిడ్డను నేను, నయీం చంపుతానన్నా బెదరని వాడ్ని నేను, నేనో మామూలు మనిషిని.. కానీ ఏనాడు డబ్బులు పెట్టకుండానే నన్ను గెలపించారు, తెలంగాణ ఉద్యమ పుణ్యాన్నే నేను ఎమ్మెల్యేనయ్యాను, ఆ తర్వాత మీ ప్రేమ పొందేలా పనిచేసి మళ్లీ మళ్లీ గెలిచాననని ఈటల రాజేందర్ వివరించారు. ‘‘రాజకీయ నేతల్లారా, ప్రజాస్వామిక వాదుల్లారా.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించండి.. ఇప్పటికే 192 కోట్లు ఖర్చుచేసారు.. ఇంకో 4-5 వందల కోట్లు ఖర్చు చేస్తారట.. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి.. డబ్బుంటేనే సర్పంచి, ఎమ్మెల్యే, ఎంపీలయ్యే పరిస్థితి వస్తే.. ఇకపై సామాన్యులు నాయకులెలా అవుతారు? ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ధర్మమే గెలుస్తుందన్న తీర్పునిచ్చి హుజురాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించాలి.. నేను గెలవడమంటే.. అది నా గెలుపు కాదు.. మీ అందరి గెలుపు.. రేపటి అసెంబ్లీలో మీ అందరి గొంతునౌతా..’’ నని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.