మాస్క్ పెట్టుకుంటే  ఫైన్‌ కట్టాల్సిందే

మాస్క్ పెట్టుకుంటే  ఫైన్‌ కట్టాల్సిందే

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో అమలు
మెండసీనో (యూఎస్):ఎక్కడైనా మాస్క్ పెట్టుకోకుంటే ఫైన్లు వేస్తరు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ మెండసీనోలోని ఓ రెస్టారెంట్ లో మాత్రం మాస్క్ పెట్టుకున్నోళ్లకే ఫైన్లు వేస్తున్నరు! అంతేకాదు.. ‘‘నేను టీకా వేసుకున్నాను.. పెద్ద తోపుని” అంటూ ఈ రెస్టారెంట్ లో గప్పాలు కొట్టినా కూడా బిల్లులో ఫైన్ యాడ్ చేస్తున్నరు. మెండసీనోలోని ఫిడెల్ హెడ్స్ కేఫ్​లో ఈ ఫైన్ ల విధానం అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు దునియా అంతా యాడ జూసినా ముఖానికి మాస్క్ పెట్టుకున్న మనుషులే కన్పిస్తరు. అన్ని దేశాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేసిన్రు. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చినోళ్లకు ఫైన్లు కూడా వేస్తున్నరు. కానీ అమెరికాలో మాత్రం అందరికీ టీకాలు వేసేశామని, ఇక మాస్క్ లు అవసరం లేదని ప్రెసిడెంట్ బైడెన్ ఇదివరకే ప్రకటించారు. దీంతో మాస్క్ లు పెట్టుకున్నోళ్లకు ఫైన్ లు వేయాలన్న ఆలోచన వచ్చిందని రెస్టారెంట్  ఓనర్ క్రిస్ క్యాజిల్ మాన్ చెప్తున్నారు. 
మాస్క్ కు 5, గప్పాలకు మరో 5 డాలర్లు..
ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే 5 డాలర్లు (రూ. 364) అదనంగా బిల్లు వేస్తామని ఫిడెల్ హెడ్స్ కేఫ్​లో బోర్డు పెట్టారు. టీకా గురించి గప్పాలు కొడితే మరో 5 డాలర్ల ఫైన్ వేస్తామని పేర్కొన్నారు. అయితే ఫైన్ కట్టాల్నా? వద్దా? అన్నది కస్టమర్ల ఇష్టమని, ఇందులో బలవంతం ఏమీ ఉండదని క్రిస్ క్యాజిల్ మాన్ ‘ఎన్బీసీ న్యూస్’తో వెల్లడించారు. మాస్క్ పెట్టుకోవడం తనకు పెద్దగా ఇష్టం లేదని, అందుకే ఈ కొత్త పద్ధతిని ప్రారంభించామని చెప్పారు. ఫైన్ల ద్వారా వచ్చే పైసలను తాము తీసుకోవడం లేదని, గృహ హింస బాధితులను ఆదుకునేందుకు పని చేస్తున్న ‘ప్రాజెక్ట్ శాంక్చురీ’ అనే ఎన్జీవోకు ఆ డబ్బులు ఇస్తున్నామన్నారు. ఫైన్ కట్టేందుకు కొందరు సంతోషంగా ఒప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం కోపానికొస్తున్నారని అన్నారు. కాగా, ‘మాస్క్ ను డస్ట్ బిన్ లో పారేయండి.. 50 శాతం డిస్కౌంట్ పొందండి” అంటూ గత ఏప్రిల్ నెలలో ఈ రెస్టారెంట్ లో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించడం మరో విశేషం.