ఇగాదే వింబుల్డన్.. గ్రాస్ కోర్టులో తొలి టైటిల్ సొంతం

ఇగాదే వింబుల్డన్.. గ్రాస్ కోర్టులో తొలి టైటిల్ సొంతం
  •  ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్లో గెలుపు
  •  కెరీర్‌‌‌‌లో ఆరో గ్రాండ్‌‌స్లామ్ గెలిచిన పోలాండ్ స్టార్

లండన్:  పోలాండ్ స్టార్‌‌‌‌, మాజీ వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వైటెక్ అనుకున్నది సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో  కొత్త విజేతగా అవతరించింది. పోలాండ్ తరఫున వింబుల్డన్ నెగ్గిన తొలి ప్లేయర్‌‌‌‌గా చరిత్ర సృష్టించింది. కెరీర్‌‌‌‌లో లోటుగా ఉన్న గ్రాస్‌‌ కోర్ట్ టైటిల్‌‌ను ఎట్టకేలకు అందుకుంది.  శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో 8వ సీడ్ ఇగా 6–-0, 6–-0తో  13వ సీడ్ అమండా అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చేసింది. 114 ఏండ్ల  తర్వాత వింబుల్డన్ విమెన్స్‌‌ ఫైనల్‌ను ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా నెగ్గిన ప్లేయర్‌‌‌‌గా ఇగా రికార్డు సృష్టించింది. 1911లో డోరోథియా లాంబెర్ట్ ఛాంబర్స్ ఒక్క గేమ్ కోల్పోకుండా డోరా బూత్బీపై నెగ్గింది. స్వైటెక్‌‌ కెరీర్‌‌‌‌లో  మొత్తంగా ఇది ఆరో గ్రాండ్‌‌స్లామ్ టైటిల్. గ్రాండ్‌‌స్లామ్ ఫైనల్స్‌‌లో ఆమె రికార్డు 6--–0గా ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టులలో 4 టైటిళ్లు, యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టులో ఒక ట్రోఫీ సాధించింది. తన ప్రొఫెషనల్ కెరీర్‌‌లో క్లే కోర్టు టోర్నమెంట్‌‌లో సాధించిన మొదటి టైటిల్ వింబుల్డన్ కావడం విశేషం. ఈ విజయంతో ఇగా1992లో మోనికా సెలెస్ తర్వాత తన తొలి ఆరు గ్రాండ్‌‌స్లామ్ ఫైనల్స్‌‌ను గెలుచుకున్న మొదటి మహిళగా నిలిచింది. మూడు రకాల కోర్టుల్లో (క్లే, హార్డ్, గ్రాస్) మేజర్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక యాక్టివ్ ప్లేయర్‌‌‌‌ తనే కావడం మరో విశేషం. 

ఇగా ఫటాఫట్‌‌  

ఖతర్నాక్ ఆటతో ఫైనల్‌‌ను వన్‌‌సైడ్ వార్‌‌‌‌గా మార్చిన ఈ మ్యాచ్ ను కేవలం 57 నిమిషాల్లోనే ముగించింది.  ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌‌లో గతంలో క్వార్టర్ ఫైనల్స్‌‌ను దాటిన అనుభవం ఆమెకు లేదు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జర్మనీలో జరిగిన ఒక చిన్న టోర్నమెంట్‌‌లో రన్నరప్‌‌గా నిలవడం మాత్రమే గ్రాస్‌‌ కోర్టుపై 24 ఏండ్ల స్వైటెక్  బెస్ట్ పెర్ఫామెన్స్‌‌.  కానీ, ఈ మ్యాచ్‌‌లో ఆడిన ఇగా మొత్తం పాయింట్లలో 55-–-24తో పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. కేవలం 10 విన్నర్లతోనే తను ఈ విజయాన్ని అందుకుంది. మరోవైపు కెరీర్‌‌లో తొలి మేజర్ ఫైనల్ ఆడిన అనిసిమోవా మొదటి నుంచి తడబడింది. 28 అనవసర తప్పిదాలు చేసింది. సెమీ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకను ఓడించిన అమెరికన్.. ఆఖరాటలో ఇగా ముందు తేలిపోయింది. 

ఏ ఒక్క గేమ్‌‌లోనూ బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. ఆట సాగుతున్న కొద్దీ వరుస తప్పిదాలు చేసింది. దాంతో తన సర్వీస్‌‌లను నిలబెట్టుకుంటూనే.. అనిసిమోవా సర్వ్‌‌లను వరుసగా బ్రేక్ చేసిన ఇగా ఫటాఫట్ ఆటతో మ్యాచ్‌‌ను ముగించింది.  2024  ఆరంభం వరకూ  నంబర్ వన్ ప్లేస్‌‌లో ఉన్నప్పటికీ ఏడాదికంటే ఎక్కువ కాలం ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం వల్ల స్వైటెక్‌‌ ఈ టోర్నీలో 8వ సీడ్‌‌గా బరిలోకి దిగింది. పైగా, గతేడాది ఆమె ఒక నెల పాటు డోపింగ్ నిషేధాన్ని ఎదుర్కొంది. ఈ సవాళ్ళన్నింటినీ అధిగమించి ఆమె వింబుల్డన్ గెలవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. ఇక, అనిసిమోవా  గతేడాది ఆరంభంలో మానసిక ఒత్తిడి కారణంగా  ఏడు నెలల పాటు ఆటకు దూరమై  442వ ర్యాంక్‌‌కు పడిపోయింది. గత వింబుల్డన్‌‌లో  క్వాలిఫయింగ్ రౌండ్లను కూడా దాటలేకపోయింది. ఆ స్థాయి నుంచి కేవలం 12 నెలల్లోనే ఫైనల్‌‌ చేరి ఔరా అనిపించిన అనిసిమోవా ఆమె వచ్చే వారం తన కెరీర్‌‌‌‌లో తొలిసారిగా టాప్–10 ర్యాంక్‌‌లోకి రానుంది. 

ప్రైజ్‌మనీ

స్వైటెక్​: రూ. 34.82 కోట్లు 
అనిసిమోవా: రూ. 17.64 కోట్లు 

1  వింబుల్డన్ చాంపియన్‌‌షిప్ గెలిచిన పోలాండ్ తొలి ప్లేయర్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌.
8  వింబుల్డన్‌‌ విమెన్స్ సింగిల్స్‌‌లో కొత్త చాంపియన్‌‌ రావడం ఇది వరుసగా ఎనిమిదోసారి. 
100  గ్రాండ్‌‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌‌ల్లో స్వైటెక్‌‌కు ఇది వందో విజయం.