గ్రేటర్​లో 83 వేల  విగ్రహాలు నిమజ్జనం

గ్రేటర్​లో 83 వేల  విగ్రహాలు నిమజ్జనం
  • వ్యర్థాల తొలగింపునకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్
  • ఇప్పటికే 10 వేల టన్నుల చెత్త తరలింపు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం ఘనంగా ముగిసింది. ట్యాంక్​బండ్​లో సోమవారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ నెల12 నుంచి 20 వరకు హుస్సేన్​సాగర్ సహా 33 చెరువులు, 25 కొలనుల్లో 83,186 గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సాగర్ లో 25 వేలు, మిగతా ప్రాంతాల్లో 58 వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేశారు. నిమజ్జనం పూర్తవడంతో అధికారులు వ్యర్థాల తొలగింపుపై దృష్టి పెట్టారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో శోభాయత్రతో పేరుకుపోయిన చెత్తను బల్దియా ఎప్పటికప్పుడు క్లియర్​చేసింది. ఇలా ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించింది. హుస్సేన్ సాగర్ లో వ్యర్థాలను తీయడానికి హెచ్ఎండీఏ అధికారులు 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. నేటి నుంచి క్లీనింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ప్రత్యేక యంత్రాలతో విగ్రహాలతోపాటు, సాగర్​లో పేరుకుపోయిన ఇతర వ్యర్థాలను తొలగిస్తారు. ఈసారి ట్యాంక్​బండ్​పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతోపాటు నిమజ్జనం టైంలో కూడా కొన్ని విగ్రహాలను ఎప్పటికప్పుడు తరలించారు. దీంతో సాగర్ లో కలిసిన వ్యర్థాలు 8 వేల మెట్రిక్ టన్నులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 
వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల పరిమాణం ఏటా పెరుగుతూనే ఉంది. 2019 వినాయక నిమజ్జనాల తర్వాత 6,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఈసారి దాదాపు 50 వేల గణపతులను నిమజ్జనం చేయగా.. ఒక్కో గణపతి నుంచి 80 కిలోల వరకు చెత్త అదనంగా చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాష్ కలెక్టర్లు, ఎక్సావేటర్లు, డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాఫ్ట్ యంత్రాలతో చెత్త బయటకుతీయనున్నారు.