ఇమ్రాన్ ఖాన్ బతికే ఉండు.. మరణ పుకార్లకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్

ఇమ్రాన్ ఖాన్ బతికే ఉండు.. మరణ పుకార్లకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. జైల్లో ఆయన హత్యకు గురయ్యాడన్న ప్రచారం అంతా వట్టిదే అని తేలిపోయింది. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నారు. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 2) అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్‎ను ఆయన సోదరీమణులు కలిశారు. ఇమ్రాన్ మరణ పుకార్లలో నేపథ్యంలో తమ సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సోదరీమణులు మంగళవారం (డిసెంబర్ 2) అడియాలా జైలు అధికారులను అనుమతి కోరారు. 

ఇందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ కార్యకర్తలు అడియాలా జైలు దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి చేదాటుతుండటంతో చివరకు ఇమ్రాన్ ఖాన్‎ను కలిసేందుకు ఆయన సోదరీమణులకు జైలు అధికారులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. అడియాలా జైలు దగ్గర పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

జైలు చుట్టూ భద్రతను బలోపేతం చేశారు. అడియాలా జైలుకు వచ్చే రోడ్లు మూసివేశారు. రావల్పిండిలో 144 సెక్షన్  అమలు చేశారు. మరోవైపు.. జైలు నుంచి బయటకు వచ్చాకా ఇమ్రాన్ సోదరీమణులు మీడియాతో మాట్లాడనున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అడియాలా జైలులో ఆయనను కలిసిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియా, పీటీఐ కార్యకర్తలకు సమాచారం ఇవ్వనున్నారు. 

►ALSO READ | పాక్ రాజధానిలో రెండు నెలలు 144 సెక్షన్.. ఇమ్రాన్ సపోర్టర్స్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి

అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుంచి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబీకులను కూడా కలవనివ్వడం లేదు. ఇదిలా ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ సహా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ హత్యకు గురయ్యారని పేర్కొన్నాయి.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఒక ఫొటోను కూడా విడుదల చేశాయి. దీంతో ఇమ్రాన్ మరణ వార్త పుకార్లు పాకిస్తాన్‎లో వేగంగా వ్యాపించి పీటీఐ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్‎ను చూపించాలని అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లో ఇమ్రాన్ ఖాన్‎ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇమ్రాన్ మరణ పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది.