V6 News

థామస్ కప్‎లో ఇండియా బోణీ.. కెనడాపై ఘన విజయం

థామస్ కప్‎లో ఇండియా బోణీ.. కెనడాపై ఘన విజయం

హోర్సెన్స్ (డెన్మార్క్): థామస్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 4–1తో కెనడాపై గెలిచింది. తొలి సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 21–18, 19–21, 10–21తో వరల్డ్‌‌‌‌ 13వ ర్యాంకర్‌‌‌‌ విక్టర్‌‌‌‌ లాయ్‌‌‌‌ చేతిలో పోరాడి ఓడాడు. కానీ మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 21–10, 21–11తో జొనాథన్‌‌‌‌ బింగ్‌‌‌‌సాన్‌‌‌‌ లాయ్‌‌‌‌–కెవిన్‌‌‌‌ లీపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేశారు. 

ఆసియా బ్యాడ్మింటన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ రన్నరప్‌‌‌‌ ఆయుష్‌‌‌‌ షెట్టి రెండో సింగిల్స్‌‌‌‌లో 21–13, 21–17తో బ్రియాన్‌‌‌‌ యంగ్‌‌‌‌ను ఓడించి ఇండియా ఆధిక్యాన్ని 2–1కి పెంచాడు. రెండో డబుల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో హరిహరన్‌‌‌‌–ఎం.ఆర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ 21–7, 21–12తో టై అలెగ్జాండర్‌‌‌‌ లిండెమన్‌‌‌‌–నైల్‌‌‌‌ యకురాపై గెలవగా, మూడో సింగిల్స్‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ 21–17, 21–12తో జోషువా ఎన్గుయెన్‌‌‌‌ను ఓడించి ఇండియా విజయాన్ని 4–1తో ఖాయం చేశాడు. 

తాజా విజయంతో ఇండియా గ్రూప్‌‌‌‌–ఎలో రెండో స్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ చైనా 5–0తో ఆస్ట్రేలియాపై గెలిచి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా 2–3 తేడాతో డెన్మార్క్‌‌‌‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌‌‌‌లో పీవీ సింధు 21–13, 18–21, 21–17తో లైన్‌‌‌‌ క్రిస్టోఫర్సెన్‌‌‌‌పై చెమటోడ్చి గెలిచింది. గంట పాటు జరిగిన మ్యాచ్​లో సింధు రెండో గేమ్​లో ఓడింది. 

అయితే డిసైడర్​లో తన మునుపటి ఫామ్‎ను చూపెడుతూ బలమైన స్మాష్​లు, క్రాస్​ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయింది. రెండో సింగిల్స్‌‌‌‌లో ఉన్నతి హుడా 12–21, 23–25తో లైన్ హోజ్‌‌‌‌మార్క్ జేర్స్‌‌‌‌ఫెల్డ్ చేతిలో ఓడింది. డబుల్స్‌‌‌‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 17–21, 21–11, 21–23తో అమెలీ సెసిలి–మ్యాట్‌‌‌‌ వెర్జ్‌‌‌‌ చేతిలో పరాజయం చవిచూశారు.

 మరో సింగిల్స్‌‌‌‌లో తన్వీ శర్మ 21–19, 16–21, 16–21తో అమెలీ షుల్జ్‌‌‌‌ చేతిలో కంగుతిన్నది. డబుల్స్‌‌‌‌లో సింధు–తానీషా క్రాస్టో 19–21, 17–14 స్కోరుతో ఉన్న దశలో అలెగ్జాండర్‌‌‌‌ బోజె–క్రిస్టిని బుష్‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌ హర్ట్‌‌‌‌గా వెనుదిరిగారు.