Iran vs USA Clash: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026)లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, ఫుట్‌బాల్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఒక హై-వోల్టేజ్ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నమెంట్‌లో ఒకే గ్రూప్‌లో లేనప్పటికీ, ఆతిథ్య దేశమైన అమెరికా (USA), ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నడుమ టోర్నీలో ఆడుతున్న ఇరాన్ జట్లు నేరుగా 'రౌండ్ ఆఫ్ 32' నాకౌట్ స్టేజ్‌లో తలపడే ఛాన్స్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే క్రీడా రంగాన్నే కాకుండా ప్రపంచ రాజకీయాలను కూడా ఆకర్షించే ఒక చారిత్రాత్మక మ్యాచ్‌ను ఫుట్ బాల్ ఫ్యాన్స్ చూడనున్నారు.
రౌండ్ ఆఫ్ 32 లెక్కలు:
ప్రస్తుత టోర్నీలో అమెరికా జట్టు గ్రూప్-డిలో ఉండగా, ఇరాన్ జట్టు గ్రూప్-జీలో ఉంది. రూల్స్ ప్రకారం ఈ రెండు జట్లు రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో తలపడాలంటే.. లీగ్ దశ ముగిసేసరికి అమెరికా తమ గ్రూప్-డీలో, ఇరాన్ తమ గ్రూప్-జీలో రెండవ స్థానం (Runners-up)లో నిలవాల్సి ఉంది. ఈ రెండు టీమ్స్ తమతమ గ్రూపుల్లో రన్నరప్స్‌గా నిలిస్తే, ఈ మెగా ఈవెంట్‌లో మ్యాచ్ నెంబర్ 88గా జూలై 3, 2026న డల్లాస్ స్టేడియం (Dallas Stadium) వేదికగా అమెరికా వర్సెస్ ఇరాన్ నాకౌట్ పోరు జరగనుంది. లేదంటే, ఫైనల్–16లో తలపడేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు రెండుసార్లే(1998, 2022) మాత్రమే పోటీ పడ్డాయి.
ఉద్రిక్తతల మధ్య ఇరాన్ జర్నీ:
ఫిఫా ప్రపంచకప్ 1930లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలోనే ఇలాంటి ఒక అరుదైన సందర్భం ఎప్పుడూ రాలేదు. ఒక ఆతిథ్య దేశం (Host Nation), తమతో అధికారికంగా యుద్ధం చేస్తున్న దేశ జట్టుకు స్వాగతం పలకడం ఇదే మొదటిసారి. తీవ్ర వీసా ఇబ్బందులు, భద్రతా కారణాల నడుమ ఇరాన్ జాతీయ జట్టు మొదట మెక్సికోలోని టిజువానా మీదుగా మారియట్ హోటల్ బేస్ క్యాంప్‌కు చేరుకుని, ఆ తర్వాత భారీ సైనిక, పోలీసు రక్షణ వలయంలో లాస్ ఏంజెల్స్‌కు వచ్చింది. ఇరాన్ ప్రజలకు ఫుట్‌బాల్ అనేది ఒక మతం లాంటిది కావడంతో, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తమ జట్టుకు సపోర్టుగా అభిమానులు నిలుస్తున్నారు.
అమెరికా, ఇరాన్ జట్ల గ్రూప్ స్టేజ్ షెడ్యూల్:
* అమెరికా (Group D) మ్యాచ్‌లు: యూఎస్ఏ జట్టు ఇప్పటికే జూన్ 12న పరాగ్వేతో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత జూన్ 19న ఆస్ట్రేలియాతో (సీటెల్ స్టేడియంలో), జూన్ 25న టర్కీతో (శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో) తలపడనుంది.
* ఇరాన్ (Group G) మ్యాచ్‌లు: ఇరాన్ జట్టు జూన్ 15న న్యూజిలాండ్‌తో (లాస్ ఏంజెల్స్ స్టేడియంలో) తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 21న బెల్జియంతో, జూన్ 26న ఈజిప్ట్‌తో (సీటెల్ వేదికగా) తలపడాల్సి ఉంది.
