బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  అందరిలో అవగాహన, ఆలోచనా మార్పు వచ్చినప్పుడే ఈ వ్యవస్థ అంతమవుతుంది అని ఆయన పిలుపునిచ్చారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్, నవీన్ యాదవ్,  ప్రముఖ చైల్డ్ రైట్స్ సామాజిక వేత్త శాంత సిన్హా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. చిన్నారుల చేతుల్లో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.అంతేకాదు, బాలల సంక్షేమం, యువత నైపుణ్యాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మంత్రి వివరించారు. చదువు తక్కువ ఉన్నా సరే, యువతలోని టాలెంట్‌ను గుర్తించి అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని.. జర్మన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. బాల కార్మిక వ్యవస్థపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారం నిర్వహించాలని కోరారు.

తెలంగాణ  చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్ కావాలి

కార్మిక చట్టాల రూపకల్పనలో దివంగత నేత వెంకటస్వామి  చేసిన కృషిని చైల్డ్ రైట్స్ సామాజిక వేత్త శాంత సిన్హా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. NCL (నేషనల్ చైల్డ్ లేబర్) ప్రోగ్రామ్ తీసుకువచ్చింది ఆయనేనని, ఆయన రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్ కావాలని ఆకాంక్షిస్తూ.. గ్రామాల్లో, పట్టణాల్లో బాల కార్మికులు లేని ప్రాంతాలుగా డిక్లేర్ చేసే సర్పంచ్‌లను ప్రత్యేకంగా సన్మానిస్తామని ఆమె ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా కార్మిక శాఖ చేస్తున్న కృషిని అభినందించారు.

 ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. తాము గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయం నుంచి  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు బాల కార్మికుల నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. అయితే, ఆ కృషికి తగ్గ ప్రచారం జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లలను చదువు వైపు నడిపించాలి. సోషల్ మీడియాను వాడుకొని బాల కార్మిక నిర్మూలనపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే తెలంగాణను వంద శాతం లేబర్ ఫ్రీ స్టేట్ గా మార్చడానికి అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని ఎమ్మెల్యే వినోద్ పిలుపునిచ్చారు.