తొలి రెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇండియా మూడో వన్డేలో చెలరేగి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి ఆతిధ్య ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో మొదటి గెలుపు రుచి చూశారు. 237 పరుగుల ఛేజింగ్ లో రోహిత్ శర్మ (121) సెంచరీతో అదరగొడితే.. విరాట్ కోహ్లీ (74) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసి గెలిచింది.
237 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్లు శుభమాన్ గిల్, రోహిత్ శర్మ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఆసీస్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగుతూ పరుగుల వరద పారించారు. తొలి వికెట్ కు గిల్, రోహిత్ 69 పరుగులు జోడించారు. గిల్ ను ఎట్టకేలకు హేజల్ వుడ్ ఔట్ చేసి తొలి వికెట్ తీశాడు. ఈ సమయంలో రోహిత్ కు జత కలిసిన కోహ్లీ జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మొదట రోహిత్.. ఆ తర్వాత కోహ్లీ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ క్రీజ్ లో పాతుకుపోవడంతో ఆసీస్ వీరి జోడీ విడగొట్టలేకపోయింది.
ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మ 105 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ కు ఇది 50 వ సెంచరీ కావడం విశేషం. వన్డే కెరీర్ లో ఇది 33 వ శతకం కావడం విశేషం.
బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా విఫలం:
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. 56 పరుగులు చేసిన మాట్ రెన్షా టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), షార్ట్ (30), ట్రావిస్ హెడ్ (29) రాణించారు. ఇండియా బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ రెండు.. అక్షర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.
►ALSO READ | IND vs AUS: సిడ్నీ వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ శతకం
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆసీస్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం ఇచ్చారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరిన బంతిని ఆడిన హెడ్ పాయింట్ లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే మార్ష్ ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన రెన్షాను సుందర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు.
124 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్యారీ, షార్ట్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. నాలుగో వికెట్ కు 59 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. అయితే శ్రేయాస్ అయ్యర్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ కు క్యారీ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి ఆసీస్ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. నాథన్ ఎల్లిస్ (16), కూపర్ కొన్నోల్లీ (23) సహకారంతో ఆస్ట్రేలియా 230 పరుగుల మార్క్ అందుకుంది. మరో నాలుగు ఓవర్ల ఆట ఉన్నపటికీ 46 ఓవర్లో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ ను ముగించాడు.
Rohit Sharma and Virat Kohli lead India to a win in the final ODI 👌#AUSvIND 📝: https://t.co/gElymMZSKE pic.twitter.com/Jd3tdWT6RW
— ICC (@ICC) October 25, 2025
