
సోలో (ఇండోనేసియా): హైదరాబాద్ యంగ్ షట్లర్ కలగోట్ల వెన్నెల.. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఇండివిడ్యువల్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో వెన్నెల 21–18, 17–21, 21–17తో జన్యపోర్న్ మీపాంతోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. ఫలితంగా ఈ టోర్నీలో పతకం ఖాయం చేసుకున్న రెండో ఇండియన్ షట్లర్‌గా రికార్డుకెక్కింది. 2012లో సింధు (గోల్డ్ మెడల్) ఈ ఘనత సాధించింది.
58 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి షార్ప్ ర్యాలీస్‌తో ఆకట్టుకుంది. కానీ రెండో గేమ్‌లో థాయ్ ప్లేయర్ బలమైన స్మాష్‌లతో ఇబ్బందిపెట్టింది. డిసైడర్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోటీపడినా చివర్లో వెన్నెల క్రాస్ కోర్టు విన్నర్లతో మ్యాచ్‌ను ముగించింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ తన్వీ శర్మ 21–19, 21–14తో ఐదోసీడ్ థలిత రామధాని విర్యవాన్ (ఇండోనేసియా)పై గెలిచి మెడల్ ఖాయం చేసుకుంది. సెమీస్‌లో వెన్నెల.. లియు సి య (చైనా), తన్వీ.. యిన్ యి క్వింగ్ (చైనా)తో తలపడతారు.