ఇందిరమ్మ ఇండ్లు 45 శాతం మంది స్టార్ట్ చేయలే!.. ఫస్ట్ ఫేజ్ లో 14,550 మందికి ఇండ్లు

ఇందిరమ్మ ఇండ్లు 45 శాతం మంది  స్టార్ట్ చేయలే!.. ఫస్ట్ ఫేజ్ లో 14,550 మందికి ఇండ్లు
  • కడుతున్నది 7,622 మంది మాత్రమే
  • ముందుగా లబ్ధిదారులకు అధికారుల నోటీసులు
  • పట్టించుకోకుంటే ఇతరులకు చాన్స్​

సంగారెడ్డి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్ల లబ్ధిదారులు చూపించిన ఆసక్తి వాటిని నిర్మించుకోవడంలో చూపించడం లేదు. మంజూరైన వాటిలో ఇంకా 45 శాతం మంది లబ్ధిదారులు పనులు స్టార్ట్ చేయలేదు. నిబంధనలకు అనుగుణంగా ఇప్పటివరకు ప్రారంభం కానీ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 3,18,435 మంది దరఖాస్తు చేసుకోగా 1,36,821 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో 16,559 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా ఎల్-1, ఎల్-2 ఎంపికలో 2,009 మంది నుంచి ఫిర్యాదులు అందడంతో వారిని పెండింగ్ పెట్టి కలెక్టర్ ప్రావీణ్య 14,550 మందికి ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో కట్టుకుంటున్నది 7,622 మంది. 

ఇప్పటివరకు పనులు స్టార్ట్ చేయనివారు 6,928 (45 శాతం) మంది ఉండగా మరో 2 శాతం ఇండ్లు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎంపీడీవో, హౌసింగ్, పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్న సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు 45 రోజుల్లో పనులు స్టార్ట్ చేయాలి కానీ శాంక్షన్ చేసి 6 నెలలైనా పనులు మొదలుపెట్టకపోవడంతో ఆయా లబ్ధిదారులను బ్లాక్ లిస్టులో పెట్టి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు . 

 నిర్మాణాల్లో 7,622 ఇండ్లు 

జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 7,622 ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. జిల్లా మొత్తంలో 14 ఇండ్లు పూర్తికాగా, 5,417 ఇండ్లు బేస్ మెంట్ స్థాయిలో ఉన్నాయి. రూఫ్ లెవెల్ లో 1,915, ఆర్ సీసీ స్థాయిలో 795 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు పనులు మొదలు పెట్టని 45 శాతం ఇండ్లలో ఎవరైనా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబితే వాటిని రద్దు చేయనున్నారు. మరెవరైనా కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని డిక్లరేషన్ ఇస్తే మార్క్ అవుట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలా కాకుండా వచ్చే ఏడాది నిర్మించుకుంటామని ముందుకు వచ్చే వారికి ప్రస్తుతానికి రద్దు చేసి వచ్చే ఏడాది కొత్తగా మంజూరు చేయనున్నారు.

రద్దు చేస్తాం

ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 రోజుల్లో ఇల్లు స్టార్ట్ చేయాలి. జిల్లాలో ఇప్పటివరకు 45 శాతం ఇండ్ల పనులు మొదలుపెట్టలేదు. వాటిని కొత్తవారికి కేటాయిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, నిర్మాణాల్లో ప్రభుత్వాన్ని నిబంధనలకు లోబడే కార్యాచరణ చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చలపతిరావు, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ