ఇందిరమ్మ నిర్మాణాలు స్పీడప్

ఇందిరమ్మ నిర్మాణాలు స్పీడప్
  • ఆర్థికంగా వెనుకబడినవారికి బ్యాంకు లోన్లు రూ.50.95 కోట్లు 
  • కలెక్టర్​ స్పెషల్​ ఫోకస్​తో పనుల్లో వేగం
  • వారంలో జైతాపూర్ గ్రామంలో గృహ ప్రవేశాలు 

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ఫోకస్​ పెట్టి ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు బ్యాంకు లోన్లు ఇప్పించారు.  ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని వారి కోసం ఈనెల 13న  మాస్​ మార్కింగ్ మేళా నిర్వహించడంతో కీలక మలుపు తిరిగింది. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని వారంతా పనులు ప్రారంభించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో 15 గృహ ప్రవేశాలు చేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 

స్కీమ్ సక్సెస్​ దిశగా..

జిల్లాకు 19,397 ఇండ్ల మంజూరు​ కాగా, 17,301మంది అర్హులను గుర్తించి మంజూరు ఇచ్చారు. ఇందులో 9,486 ఇండ్ల పనులు ప్రారంభం కాగా, 4,820 ఇండ్ల బేస్మెంట్ లెవల్​కు పూర్తయ్యాయి. 742 రూఫ్ లెవెల్,  237 స్లాబ్​ లెవెల్,​  మిగతావి ఆయా దశల్లో ఉన్నాయి. నిర్మాణ దశలను బట్టి  ఇప్పటి వరకు రూ.60.36 కోట్లు  లబ్ధిదారులకు అందాయి.  బేస్మెంట్ పూర్తైన ఇండ్లకు తొలి విడతగా రూ.లక్ష అందజేశారు. పనులు మొదలుపెట్టనివారు 4,348 మంది ఉన్నట్లు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి గుర్తించారు.  

వారందరికీ బ్యాంకుల నుంచి రూ.50.95 కోట్లు లోన్లు ఇప్పించగా పనులు ప్రారంభించారు.  ప్రొసీడింగ్స్​ పొంది అసలు పనులు ప్రారంభించని 7,815 మందితో ఈ నెల 13న మాస్​ మార్కింగ్​ మేళా నిర్వహించి విలేజ్ సెక్రెటరీలు, ఆఫీసర్ల సమక్షంలో ముగ్గు పోయించారు.  జైతాపూర్​ గ్రామానికి మంజూరైన 74 ఇండ్లలో 15 పూర్తై  గృహ ప్రవేశాలకు ముహూర్తం  ఖరారు చేస్తున్నారు.