
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడా మునిసిపాలిటీలో రావిరాల వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను దోచుకున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మార్చి 2 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హర్యాణాలోని మేవాత్ జిల్లాకు చెందిన ఈ ముఠా, గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, సీసీ కెమెరాలపై స్ప్రే పెయింట్ చల్లి, ముఖాలకు మాస్కులు ధరించి కేవలం 6 నిమిషాల్లో రూ.29,69,900 చోరీ చేసి పరారైంది. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి, 22 రోజుల పాటు విచారణ జరిపారు.
చివరకు హర్యాణాలోని మేవాత్ జిల్లాలో ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు. మేవాత్ జిల్లాకు చెందిన ఈ దొంగలు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో చోరీలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చోరీలు చేసి స్వస్థలాలకు పారిపోతారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో దొంగలకు సహకరించిన వారు ఎవరు, ఎంత సొమ్ము స్వాధీనం చేసుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.