ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ

 ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ

ఐపీఎల్‌‌‌‌ ఆఖరి ప్లే ఆఫ్స్‌‌ బెర్త్‌‌ కూడా కన్ఫామ్‌‌ అయ్యింది..! ముంబై చేతిలో ఢిల్లీ ఓడటంతో.. బెంగళూరుకు అదృష్టం కలిసొచ్చింది..! దీంతో లక్నోతో ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌కు ఆర్‌‌సీబీ రెడీ అయ్యింది..! ఇక లాస్ట్‌‌ ఓవర్‌‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో టిమ్‌‌ డేవిడ్‌‌ (11 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో ముంబై విక్టరీ సాధించగా... కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో పంత్‌‌సేన అన్ని రంగాల్లో ఫెయిలైంది..!!
ముంబై: 
ఇప్పటికే ప్లే ఆఫ్స్‌‌‌‌ రేస్‌‌కు దూరమైన ముంబై ఇండియన్స్‌‌ పోతూపోతూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను కూడా తీసుకెళ్లింది. బౌలింగ్‌‌లో బుమ్రా (3/25), బ్యాటింగ్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (35 బాల్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49), టిమ్‌‌ డేవిడ్‌‌ దంచికొట్టడంతో.. శనివారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. దీంతో 14 పాయింట్లతో డీసీ ఇంటికి వెళ్లగా, ఆర్‌‌సీబీ 16 పాయింట్లతో నాకౌట్‌‌కు చేరుకుంది.  

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేసింది. పావెల్ (34 బాల్స్ లో 1 ఫోర్, 4 సిక్స్ లతో 43), రిషబ్‌‌ పంత్ (33 బాల్స్ లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 39) రాణించారు. ఛేజింగ్‌‌లో ముంబై 19.1 ఓవర్లలో 160/5 స్కోరు చేసి గెలిచింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ (2/32), అన్రిచ్ (2/37) సత్తాచాటారు. బుమ్రాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 
ఢిల్లీ చివర్లో..
మూడో ఓవర్లోనే వార్నర్ (5) వికెట్ కోల్పోయిన క్యాపిటల్స్‌‌కు.. వరుస ఓవర్లలో మిచెల్ మార్ష్ (0), పృథ్వీ షా (24) వికెట్లు తీసిన బుమ్రా షాకిచ్చాడు. దీంతో పవర్ ప్లేలో 37/3తో ఢిల్లీ కష్టాల్లో పడింది. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ (10) కూడా విఫలం కావడంతో.. పంత్, పావెల్‌‌పై భారం పడింది. 12వ ఓవర్లో 6,6,4 బాదిన పావెల్ స్కోరులో వేగం పెంచాడు. కానీ ముంబై వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. 16వ ఓవర్లో 4,6 బాదిన తర్వాతి బంతికే పంత్ కూడా ఔట్ కావడంతో ఐదో వికెట్‌‌కు 75 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. కొద్దిసేపటికే పావెల్ ను బుమ్రా బౌల్డ్ చేసి ఢిల్లీని మరోసారి దెబ్బకొట్టాడు. ఇక చివర్లో అక్షర్ పటేల్ (19 నాటౌట్), శార్దూల్ (4)ను కట్టడి చేశారు. 
ముంబై మెల్లగా...
ఢిల్లీ బౌలర్లు కూడా అదరగొట్టడంతో ముంబై టార్గెట్​ఛేజింగ్‌‌లో నెమ్మదిగా ఆడింది. రెండో ఓవర్లోనే 4,4,6తో జోరు చూపించిన ఇషాన్ ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. అయితే రోహిత్ (2)ను అన్రిచ్ ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం రెండుసార్లు క్యాచ్ డ్రాప్ తో బతికిపోయిన బ్రెవిస్ (37) కూడా జోరు చూపించాడు. దీంతో సగం ఓవర్లకు 74/1తో నిలిచిన ముంబై మంచి స్థితిలో కనిపించింది. కాసేపటికే ఇషాన్ తో పాటు 15వ ఓవర్లో బ్రెవిస్ ఔట్ కావడంతో డేవిడ్, తిలక్ వర్మ (21) ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో ముంబై విజయ సమీకరణం 18 బాల్స్ లో 29 రన్స్ గా మారింది. ఆపై 18వ ఓవర్లో 6,6 బాదిన -డేవిడ్ ఔట్ కావడంతో ముంబైకి 12 బాల్స్‌‌లో 14 రన్స్ కావాల్సి వచ్చింది. ఈ దశలో రమణ్ దీప్ (13 నాటౌట్) ఫోర్‌‌ కొట్టగా తిలక్ ఔట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతిని ఖలీల్ నో బాల్ వేయగా.. ఫ్రీ హిట్‌‌ను ఫోర్ బాదిన రమణ్‌‌దీప్ జట్టుకు విక్టరీ అందించాడు.

స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 24, వార్నర్ (సి) బుమ్రా (బి) సామ్స్ 5, మార్ష్ (సి) రోహిత్ (బి) బుమ్రా 0, పంత్ (సి) ఇషాన్ (బి) రమణ్ దీప్ 39, సర్ఫరాజ్ (సి) ఇషాన్ (బి) మార్కండే 10, పావెల్ (బౌల్డ్) బుమ్రా 43, అక్షర్ పటేల్ (నాటౌట్) 19, శార్దూల్ (సి) డేవిడ్ (బి) రమణ్ దీప్ 4, కుల్దీప్ (నాటౌట్) 1, ఎక్స్ ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 159/7. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–31, 4–50, 5–125, 6–143, 7–157. బౌలింగ్ : సామ్స్ 4–0–30–1, హృతిక్ 4–0–34–0, బుమ్రా 4–0–25–3, మార్కండే 4–0–26–1, మెరిడిత్ 2–0–9–0, రమణ్ దీప్ 2–0–29–2.  
ముంబై: ఇషాన్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 48, రోహిత్ (సి) శార్దూల్ (బి) అన్రిచ్ 2, బ్రెవిస్ (బౌల్డ్) శార్దూల్ 37, తిలక్ వర్మ (నాటౌట్) .., డేవిడ్ (సి) పృథ్వీ (బి) శార్దూల్ 34, రమణ్ దీప్ (నాటౌట్) 13, సామ్స్ (నాటౌట్) 0, ఎక్స్ ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 160/5.  వికెట్ల పతనం: 1–25, 2–76, 3–95, 4–145, 5–155. బౌలింగ్: ఖలీల్ 3.1–0–24–0, అన్రిచ్ 4–0–37–2, శార్దూల్ 3–0–32–2, మార్ష్ 2–0–7–0, కుల్దీప్ 4–0–33–1, అక్షర్ 3–0–26–0.

మే 24: క్వాలిఫయర్‌‑1 (కోల్‌కతా) గుజరాత్‌ X రాజస్తాన్‌  7.30PM

మే 25: ఎలిమినేటర్‌ (కోల్‌కతా) లక్నో X బెంగళూరు  7.30PM