SRH vs CSK: ఉప్పల్ గడ్డపై సన్‌రైజర్స్ బౌలర్ల జోరు.. టార్గెట్ ఎంతంటే..?

SRH vs CSK: ఉప్పల్ గడ్డపై సన్‌రైజర్స్ బౌలర్ల జోరు.. టార్గెట్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైని 165 పరుగుల తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపెడుతూ సీఎస్‌కే బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కమిన్స్ తన 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు సీఎస్‌కే బ్యాటర్లు మొదట్లో ఆచితూచి ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో తొలి మూడు ఓవర్లలో సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. అనంతరం భువనేశ్వర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రచిన్‌ రవీంద్ర (12) పెవిలియన్‌కు చేరాడు. ఆపై క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రుతురాజ్ గైక్వాడ్(26).. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

రాణించిన దూబే 

54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నైని అజింక్య రహానే(35; 30 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్)- శివమ్ దూబే(45; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని కమిన్స్ విడదీశాడు. ఓ చక్కని బంతితో దూబేని ఔట్ చేశాడు. ఆపై కొద్దిసేపటికే ఉనద్కత్ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానె (35) ఔటయ్యాడు. అక్కడినుంచి చెన్నై బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. చివరలో రవీంద్ర జడేజా(31*; 23 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా.. మరో ఎండ్‌లో బ్యాటర్లు తడబడ్డారు. దీంతో సీఎస్‌కే ఓ మోస్తరు లక్ష్యానికే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.