రోహిత్ రెడ్డి ఇంట్లో రూ.20 లక్షలు పట్టివేత : బడా వ్యాపార నేతలే ఐటీ టార్గెట్

రోహిత్ రెడ్డి ఇంట్లో రూ.20 లక్షలు పట్టివేత : బడా వ్యాపార నేతలే ఐటీ టార్గెట్

అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ అధికారులు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరసగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఓ పార్టీ అభ్యర్థికి కోట్ల రూపాయలు అందిస్తున్నారనే సమాచారంతో.. లోకల్ బిజినెస్ లీటర్ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ, ఈడీ అధికారులు. కోహినూర్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ మాజీద్ ఖాన్, ఫలక్ నుమా కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ యజమాని షానవాజ్ ఇల్లు, ఆఫీసుల్లో గంటల తరబడి సోదాలు చేశారు ఐటీ అధికారులు. రాజేంద్రనగర్ శాస్త్రిపురం కింగ్స్ కాలనీ, ఫలక్ నుమా ఓల్డ్ సిటీలోని ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఓల్డ్ సిటీకి చెందిన పలువురు వ్యాపారుల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు చేసింది. 

రోహిత్ రెడ్డి ఇంట్లో రూ.20 లక్షలు పట్టివేత 

ఓటర్లను డబ్బులతో ప్రభావితం చేస్తున్నారన్న సమాచారంతో.. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు ఐటీ అధికారులు. తాండూరు, హైదరాబాద్, మణికొండ పంచవటి కాలనీల్లోని రోహిత్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రోహిత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ముగ్గురు ముఖ్య అనుచరులను అదుపులోకి తీసుకుని విచారించారు. వికారాబాద్, తాండూరు, హైదరాబాద్ లోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని రోహిత్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.