- ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి సన్నిధికి దేశ,విదేశాల నుంచి భక్తులు, టూరిస్టులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలు, గోదావరి కరకట్టను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్మృణాల్ శ్రేష్ఠ పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీ, డిగ్రీ కాలేజీ స్టూడెంట్ల ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కరకట్ట వద్ద ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో, సబ్ కలెక్టర్ మాట్లాడారు. నిత్యం భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ప్లాస్టిక్, తడి చెత్తను విచ్చలవిడిగా పడేస్తున్నారని, ఇలా చేయకూడదని సూచించారు.
ఇష్టారాజ్యంగా చెత్తను కరకట్టపై వేయడం వల్ల వాటిని కాల్చడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు పంచాయతీ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేయాలని ఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. కొత్తగా నిర్మించిన డంపింగ్‌యార్డుకు చెత్తను తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. వారి వెంట తహసీల్దారు దనియాల వెంకటేశ్వర్లు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్ ఉన్నారు.
