
- రూ. 22 వేలతో చిక్కిన జగిత్యాల డీటీవో భద్రునాయక్
- రూ. 3 వేలు తీసుకుంటూ పట్టుబడిన పాలమూరులో ఇరిగేషన్ ఏఈ
జగిత్యాల రూరల్, వెలుగు : సీజ్ చేసిన జేసీబీకి ఎలాంటి ఫైన్ వేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల డీటీవోను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్లలోని శశిధర్ అనే వ్యక్తికి చెందిన జేసీబీని మూడు రోజుల కింద పట్టుకున్న ఆర్టీవో ఆఫీసర్లు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ చేశారు.
జేసీబీకి ఎలాంటి ఫైన్ విధించకుండా తిరిగి అప్పగించాలంటే రూ. 40 వేలు ఇవ్వాలని డీటీవో భద్రునాయక్ డిమాండ్ చేశారు. దీంతో శశిధర్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 35 వేలకు ఒప్పందం జరిగింది. శశిధర్ సోమవారం డీటీవో డ్రైవర్ అరవింద్‌ను కలిసి రూ. 13 వేలు ఇచ్చాడు. మిగతా రూ. 22 వేల కోసం శశిధర్ వద్ద ఉన్న రెండ్ సెల్‌ఫోన్లను అరవింద్ తీసుకున్నాడు.
మిగతా డబ్బులు ఇస్తేనే సెల్‌ఫోన్లు ఇస్తానని చెప్పడంతో శశిధర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో బుధవారం ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి డ్రైవర్ అరవింద్‌కు రూ. రూ.22 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అరవింద్‌ను పట్టుకొని విచారించగా.. డీటీవో సూచన మేరకే తీసుకున్నానని చెప్పాడు. డీటీవో భద్రునాయక్‌ను విచారించగా.. డబ్బులు తీసుకోవాలని తానే చెప్పానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు డీటీవో భద్రునాయక్, డ్రైవర్ అరవింద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ విజయ్ తెలిపారు.
పాలమూరులో ఇరిగేషన్ ఏఈ
పాలమూరు, వెలుగు : రూ. 3 వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ సబ్ డివిజన్ ఏఈ మహ్మద్ ఫయాజ్ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన 150 గజాల స్థలానికి సంబంధించి ఎన్‌వోసీ కోసం ఇరిగేషన్ ఆఫీస్‌లో అప్లై చేసుకున్నాడు.
ఎన్‌వోసీ కావాలంటే రూ. 5 వేలు ఇవ్వాలని ఏఈ మహ్మద్ ఫయాజ్ డిమాండ్ చేయడంతో చివరకు రూ. 3 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పీఎస్ పరిధిలోని ఓ బేకరీలో ఏఈని కలిసి రూ. 3 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా
పట్టుకున్నారు.
మహమ్మదాబాద్ ఎస్టీ హాస్టల్ తనిఖీ
మెదక్ (నర్సాపూర్), వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ ఎస్టీ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఏసీబీ, మున్సిపల్, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లు తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ చెప్పారు. కిచెన్ క్లీన్‌గా లేకపోవడం, పారిశుధ్య లోపంతో పాటు భవనం శిథిలావస్థకు చేరిందని, ప్రహరీ, మరుగుదొడ్లు లేకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నామని గుర్తించామన్నారు. ఈ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.