- ఓటరు లిస్టులో పేరు ఉంటే చాలు: ఎన్నికల అధికారి కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు ఓటరు కార్డు మాత్రమే కాకుండా 12 ఫొటో గుర్తింపు కార్డుల తో ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు లిస్టులో పేరు ఉంటే సరిపోతుందని, ఓటరు కార్డు లేకపోయినా మిగతా గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చన్నారు. ఓటరు స్లిప్ గుర్తింపు కార్డు కాదని, పోలింగ్ కేంద్రం వివరాలు తెలియజేసేందుకు మాత్రమే ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్లను ఓటర్లకు పంపిణీ చేస్తామన్నారు.
ఆధార్ కార్డు, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజి స్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీల అఫీషియల్ ఐడెంటిటీ కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ కార్డుతో ఓటు వేయ వచ్చని కర్ణన్ వివరించారు.
ఉప ఎన్నికలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
