
బెదిరింపులపై ఫిర్యాదు చేసినా సీబీఐ, ఐబీ పట్టించుకోవట్లేదు
సీబీఐ తీరు ఇప్పటికీ మారట్లేదు: సీజేఐ ఎన్వీ రమణ
దేశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అనుకూలంగా తీర్పు రాకుంటే.. న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నరు. జడ్జిలను గ్యాంగ్ స్టర్లు, హైప్రొఫైల్ క్రిమినల్స్ మానసికంగా వేధిస్తున్నరు. దాడులకు దిగుతున్నరు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నరు. ఈ రకమైన ట్రెండ్ చాలా ఆందోళనకరం.. ఇలాంటి ఘటనలపై జడ్జిలు కంప్లైంట్ చేసినా పోలీసు, దర్యాప్తు సంస్థలు సహకరిస్తలేవు. ఇది చాలా సీరియస్ మ్యాటర్, నేను బాధ్యతతోనే ఈ కామెంట్లు చేస్తున్నా. ‑ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: జడ్జిలకు రక్షణ లేకుండాపోయిందని, బెదిరింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ, ఐబీ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా జడ్జిలకు ఉండటం లేదన్నారు. న్యాయవ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదని సీరియస్ అయ్యారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన జడ్జిని నడిరోడ్డుపై ఆటోతో గుద్ది చంపినా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సీబీఐ తీరులో మార్పు వస్తుందనుకున్నామని, అయినా ఎలాంటి మార్పు రాలేదని తప్పుబట్టారు. తాను ఇలా వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధాకరమని, కానీ వాస్తవ పరిస్థితి ఇలానే ఉందని ఆయన అన్నారు. ‘‘జడ్జిలు తమకు ప్రాణహాని ఉందని పోలీసులు, సీబీఐ దృష్టికి తీసుకెళ్తే స్పందన ఉంటలేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే అసలు సాయం కూడా చేస్తలేదు. ఇట్లయితే జడ్జిలకు రక్షణ ఎక్కడుంటుంది?” అని ప్రశ్నించారు. జడ్జిలకు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ నెల 17లోపు నివేదిక ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల జార్ఖండ్‌లోని ధన్బాద్లో హత్యకు గురైన జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ కేసును సుమోటోగా తీసుకున్న సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారించింది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో జడ్జి హత్య చాలా దారుణం. ఇది ముమ్మాటికి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూరే. బొగ్గు మాఫియాతో ముప్పు పొంచి ఉన్నా స్థానికులకు, అక్కడి జడ్జిలకు ఎందుకు భద్రత కల్పించడం లేదు?
ఈ సందర్భంగా పోలీసులు, సీబీఐ, ఐబీ తీరును సీజేఐ తప్పుబట్టారు. తమకు వస్తున్న బెదిరింపులపై న్యాయమూర్తులు ఐబీకి, సీబీఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు.
సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకుంటరా?
జులై 28న జార్ఖండ్‌లోని ధన్బాద్లో జరిగిన జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుప్రీంకోర్టు బెంచ్ సీరియస్‌గా తీసుకుంది. జడ్జిని కావాలనే ఆటోతో ఢీకొట్టినట్టు సీసీ ఫుటేజీల్లో కనిపిస్తోందని, ఇంత జరిగినా సీబీఐ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగించామని జార్ఖండ్ ప్రభుత్వం తెలుపగా.. ‘‘ఇంతటితో మీ పని అయిపోయినట్టేనా? సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారా?” అని సీజేఐ సీరియస్ అయ్యారు. జార్ఖండ్‌లో బొగ్గు మాఫియా నుంచి జడ్జిలకు ముప్పు పొంచి ఉన్నా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదన్నారు. జడ్జి హత్యకు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూరే కారణమన్నారు. ఈ కేసు పురోగతిపై వారం రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు.
అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిపై రిపోర్టు ఇవ్వండి
జడ్జిలు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఉన్నాయని, ఆ కేసులు పరిస్థితిపై, జడ్జిలకు కల్పిస్తున్న భద్రత చర్యలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ నెల 17లోగా రిపోర్టు అందజేయాలని పేర్కొంది. 2019లో ఓ జడ్జిపై జరిగిన దాడి కేసులో జారీ చేసిన నోటీసులకు ఇప్పటి వరకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని, వారంలోగా దీనిపైనా వివారణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.