
షాంఘై: ఇండియా కాంపౌండ్ ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం–ఒజాస్ డియోటలే జోడీ.. వరల్డ్‌కప్ స్టేజ్–2లో గోల్డ్ మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ సెమీస్‌లో జ్యోతి–ఒజాస్ 157–157 (19–19)తో ఇటాలియన్ జోడీ ఎలీసా రోనెర్–ఎలియా ఫ్రెగ్నాన్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు.
తొలి రౌండ్‌లో ఒక్క పాయింట్ లీడ్‌లో నిలిచిన ఇటలీ జోడీ.. థర్డ్ రౌండ్‌లో దాన్ని రెండు పాయింట్లకు (119–117)కు పెంచుకుంది. కానీ ఫోర్త్ రౌండ్‌లో జ్యోతి–ఒజాస్ మంచి గురితో రెండు పర్ఫెక్ట్ టెన్స్‌తో 40 పాయింట్లు సాధించడంతో స్కోరు సమమైంది. విన్నర్‌ను తేల్చేందుకు నిర్వహించిన షూటాఫ్‌లో ఇండియన్ జోడీ రెండు బాణాలను సెంటర్‌కు చాలా దగ్గరగా వేయడంతో మ్యాచ్ సొంతమైంది. రికర్వ్‌లో ఐదోసీడ్ ధీరజ్ బొమ్మదేవర–సిమ్రన్‌జిత్ కౌర్ అంచనాలను అందుకోలేకపోయారు. తొలి రౌండ్‌లోనే ఇండియా జోడీ 2–6 (39–35, 37–39, 37–38, 34–35)తో ఇండోనేసియా చేతిలో ఓడింది.