U-19 Asia Cup: శ్రీలంకతో అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

U-19 Asia Cup: శ్రీలంకతో అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

శ్రీలంకతో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. శుక్రవారం (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీలో జరుగుతున్న మ్యాచ్ లో వర్షం కారణంగా 50 ఓవర్లకు జరగాల్సిన మ్యాచ్ 20 ఓవర్లకు కుదించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 42 పరుగులు చేసిన చమిక హీనతిగల టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కిషన్ కుమార్ సింగ్,దీపేష్ దేవేంద్రన్,ఖిలాన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 

వర్షం కారణంగా మొదట బ్యాటింగ్ చేయాల్సిన వచ్చిన శ్రీలంకకు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దుల్నిత్ సిగేరా (1), విరాన్ చాముదిత (19), కవిజ గమాగే (2) ముగ్గురూ తక్కువ స్కోర్ కే ఔటై నిరాశపరిచారు.ఈ దశలో శ్రీలంక జట్టును విమత్ దిన్సారా, చమిక హీనతిగల ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. జట్టు వికెట్ల పతనాన్ని ఆపుతూ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించిన తర్వాత లంక కెప్టెన్ విమత్ దిన్సారాను కనిష్క్ చౌహాన్ పెవిలియన్ కు పంపాడు. 

కెప్టెన్ ఔట్ కావడంతో శ్రీలంక 73 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను కోల్పోయింది.  కిత్మా విథనాపతిరణ, ఆదం హిల్మీ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో లంక జట్టు 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సేథ్మికా సెనెవిరత్నే, చమిక హీనతిగల అద్భుతంగా ఆడుతూ లంక జట్టుకు ఒక మాదిరి స్కోర్ ను అందించారు. సేథ్మికా సెనెవిరత్నే 22 బంతుల్లోనే 30 పరుగులు చేసి చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓకే మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (9), ఆయుష్ మాత్రే (7) స్వల్ప స్కోర్ కే ఔటయ్యారు