న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద ఈ కేసులో పలువురు సెలబ్రెటీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, నటుడు సోను సూద్, నటి నేహా శర్మ, మోడల్ ఊర్వశి రౌతేలా తల్లి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాకు సంబంధించిన రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
ఇందులో యువరాజ్ సింగ్ రూ.2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప రూ.8.6 లక్షలు, సోను సూద్ రూ.1 కోటి, మిమి చక్రవర్తి రూ.59 లక్షలు, అంకుష్ హజ్రా రూ.47.20 లక్షలు, నేహా శర్మ రూ.1.26 కోట్ల, ఊర్వశి రౌతేలా (ఆమె తల్లి పేరు మీద ఉన్న) రూ.2.02 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో గతంలో క్రికెటర్లు శిఖర్ ధావన్‌కు సంబంధించిన రూ.4.55 కోట్లు, సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.19 కోట్లు దాటింది. ఈ ప్రముఖులందరినీ గతంలో ఈడీ పలుమార్లు విచారించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో మాజీ క్రికెటర్లు, నటుల ఆస్తులను ఈడీ జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.
