సౌతాఫ్రికాతో జరగబోయే ఐదో టీ20లో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకం. సఫారీలపై ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ దక్కుతుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ ను తన అడ్డాగా మార్చుకున్న గిల్ చివరి టీ20లో ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐదో టీ20 కోసం జట్టుతో పాటు గిల్ అహ్మదాబాద్ వెళ్లడంతో ఈ మ్యాచ్ లో గిల్ ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు గిల్ కు పాదానికి గాయమైంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా శుభమాన్ గాయపడ్డాడు. నాలుగో టీ20 మ్యాచ్ రద్దవడంతో ఐదో టీ20 సమయానికి గిల్ కోలుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో గిల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గిల్ స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయమైంది. ఫామ్ లో లేని గిల్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. గిల్ గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టీ20 వరల్డ్ కప్ ముందు గిల్ ను మ్యాచ్ ఆడించి రిస్క్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ లేదు. చివరి టీ20కి గిల్ కు రెస్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. అదే జరిగితే ఓపెనర్ గా సంజు శాంసన్ నిరూపించుకోవడానికి ఇదే సరైనసమయం. ఆస్ట్రేలియాతో రెండో టీ20 తర్వాత ప్లేయింగ్ 11లో చోటు లేకుండా బెంచ్ కే పరిమితమైన శాంసన్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
2025 టీ20 ఫార్మాట్ లో అంచనాలను అందుకోలేకపోయిన గిల్:
టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు.
►ALSO READ | IND vs SA: బుమ్రా, శాంసన్, సుందర్ ఇన్.. సౌతాఫ్రికాపై ఐదో టీ20లో ఆ ముగ్గురిపై వేటు
గిల్ చివరి 15 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(0), 28(28) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 28 పరుగులు చేసినా 28 బంతులు తీసుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. ఇలాంటి సమయంలో గిల్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.
ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా) :
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా ప్లేయింగ్ 11 (అంచనా) :
మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే, ఎంగిడి, బార్ట్‌మన్.
