దారి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తల అరెస్ట్

 దారి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తల అరెస్ట్

కామారెడ్డి టౌన్, వెలుగు : దారి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్​చంద్ర నిందితుల వివరాలు వెల్లడించారు. బసన్నపల్లికి చెందిన పెద్దల రాజు కామారెడ్డిలోని ఓ హోటల్​లో పని చేస్తున్నాడు. ఈనెల 17న రాత్రి అతడు పని ముగించుకొని బైక్​పై బసన్నపల్లికి వెళ్తున్నాడు. చర్చి గ్రౌండ్​ సమీపంలోకి రాగానే ఓ మహిళ అతడి బైక్​ను ఆపి లిఫ్ట్​అడిగింది. సరంపల్లి వద్ద దింపాలని కోరింది. ఇది నమ్మి రాజు తన బైక్​పై ఎక్కించుకొని వెళ్తుండగా ఈఎస్ఆర్ గార్డెన్ సమీపంలోకి రాగానే మరో వ్యక్తి బైక్​పై వచ్చి రాజును ఆపాడు. 

ఇద్దరు కలిసి రాజును కొట్టి అతడి వద్ద ఉన్న రూ.2 వేల నగదు, సెల్​ఫోన్ లాక్కొని పారిపోయారు. వెంటనే బాధితుడు కామారెడ్డి టౌన్​పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డిలో నివాసం ఉంటున్న  బైండ్ల భాగ్య, ఆమె  భర్త రవికుమార్ ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో​దోపిడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.600 నగదు, బైక్​స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి తదితరులు పాల్గొన్నారు.