అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

కామారెడ్డి, వెలుగు : చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు.  గురువారం ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భిక్కనూరు మండల కేంద్రంలోని దత్తాద్రి బాంబు మర్చంట్ షాపు వద్ద ఒంటరిగా ఉన్న లక్ష్మికి లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 3 తులాల బంగారు గొలుసు చోరీ చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా దొంగల ముఠా చిక్కిందన్నారు. 

మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లాకు చెందిన  అఫ్తాబ్ అహ్మద్ షేక్,   ఫహీమా బేగం, కబీరుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ షేక్, దీపక్​ కిసాన్ సలుంకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్,  సిద్దిపేట జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయన్నారు.

 వీరి నుంచి   3 తులాల బంగారు నగలు,  2 కార్లు, బైక్,  4 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఎ1 నిందితుడు అఫ్తాబ్ అహ్మద్ షేక్​పై రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో 60  కేసులు నమోదయ్యాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడన్నారు. విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో భిక్కనూరు సీఐ పంపత్​కుమార్​, సీసీఎస్​ సీఐ శ్రీనివాస్​, ఎస్సైలు అంజనేయులు, ఉస్మాన్ ఏఎస్సై వెంకట్రావు, సిబ్బంది దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు ఎస్పీ అభినందించారు.