మిజోరం గవర్నర్ గా బాధ్యలు చేపట్టిన హరిబాబు

 మిజోరం గవర్నర్ గా బాధ్యలు చేపట్టిన హరిబాబు

 

ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర గవర్నర్ గా మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాజధాని ఐజ్వాల్ లోని రాజ్ భవన్ దర్భార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ మైకేల్ జోతన్ ఖుమా గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.  కరోనా నిబంధనల కారణంగా కేవలం కొద్దిమంది ముఖ్య అతిథులను మాత్రమే కార్యక్రమానికి అనుమతిచ్చారు. మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్థంగ, డిప్యూటీ సీఎం థాన్ లుయ, స్పీకర్ లాల్ రిన్ లియానా సైలో, మంత్రివర్గ సభ్యులతోపాటు చీఫ్ సెక్రెటరీ, డీజీపీలతో పాటు మరికొందరు ముఖ్యులను మాత్రమే రాజ్ భవన్ కు అనుమతిచ్చారు. 
కంభంపాటి స్వస్థలం తిమ్మసముద్రం గ్రామం, ప్రకాశం జిల్లా
కంభంపాటి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామం. 1953లో జూన్ 15న కంభంపాటి వెంకటేశ్వర్లు, సీతమ్మ దంపతులకు జన్మించారు. కంభంపాటి సతీమణి జయశ్రీ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు. పాఠశాల విద్యను సొంత జిల్లాలోనే పూర్తి చేసిన ఆయన ఉన్నత విద్య కోసం విశాఖపట్టణంకు వెళ్లాల్సి వచ్చింది. బీటెక్ (ఎలక్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్) పూర్తి చేసిన తర్వాత పీహెచ్ డీ కూడా చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు జై ఆంధ్ర  ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే తాను చదివిన ఆంధ్ర యూనివర్సిటీలోనే అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరారు. 24 ఏళ్ల సుదీర్ఘ కాలం పనిచేసిన తర్వాత 1993లో స్వచ్ఛంద పదవీవిరమణ చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చురుకుగా పనిచేశారు.  
విశాఖపట్టణం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి...
బీజేపీ తరపున ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన ఆయన 1999లో విశాఖపట్టణం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటు తర్వాత 2014 ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి ఎంపీగా గెలిచారు. అప్పట్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మను ఓడించి సంచలనం సృష్టించారు. అటు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. అటు తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసిన హైకమాండ్ తాజాగా గవర్నర్ పదవిని కట్టబెట్టింది.