
తిమ్మాపూర్, వెలుగు : అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా, తనను వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగింది. కరీంనగర్‌కు చెందిన కామారపు అనిల్ (36) సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలో తన ఫ్రెండ్స్‌కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు.
ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అడుగగా... వారు ఇవ్వకపోగా, అనిల్ ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై గత నెల 31న తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయాడు.