మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పీరియడ్స్ టైంలో పెయిడ్ సెలవులు..

 మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పీరియడ్స్ టైంలో పెయిడ్ సెలవులు..

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలలోని మహిళా ఉద్యోగులకు జీతంతో నెలసరి సెలవులను (Menstrual Leave Policy) ఆమోదించింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు, పనిప్రదేశంలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం ఇటీవల  ఋతు సెలవు విధానం 2025ను తీసుకొచ్చింది.

ఈ కొత్త పాలసీ ప్రకారం, మహిళలు నెలసరి సమయంలో నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వస్త్ర పరిశ్రమలు, మల్టి నేషనల్ కంపెనీలు, ఐటీ సంస్థలతో సహా అన్ని ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే మహిళలకు వర్తిస్తుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని అధికారికంగా ప్రకటించడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. గతంలో ఏడాదికి ఆరు సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉండగా, ఇప్పుడు దాన్ని మార్చి ఏడాదికి పన్నెండు రోజుల జీతంలో కూడిన సెలవులను అందించనున్నారు. అంటే నెలకు ఒక సెలవు అన్నమాట.

ALSO READ : ఇండియన్ రైల్వే కొత్త పాలసీ..

కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ, మహిళలకు నెలసరి సెలవులను ఆమోదించడం మా ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం అని తెలిపారు.  మహిళలు ఏడాదికి మొత్తం 12 సెలవులను, అంటే నెలకు ఒకటి చొప్పున లేదా వారి సౌలభ్యం మేరకు ఒకేసారి తీసుకోవచ్చు. ఇది మహిళల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వానికి గర్వకారణం అని అన్నారు.

దేశంలో నెలసరి సెలవులు ఇచ్చే ట్రెండ్‌లో కర్ణాటక కూడా భాగమైంది. కేరళలోని పారిశ్రామిక శిక్షణా సంస్థల (ITI) మహిళా విద్యార్థులకు నెలకు రెండు రోజుల సెలవు ఇస్తుండగా, బీహార్ & ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఏడాదికి 12 రోజుల సెలవును అందిస్తున్నాయి.