కాస్ గంజ్ రైల్లో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు

కాస్ గంజ్ రైల్లో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు

రైలు ప్రయాణం భయపెడుతుంది. వరసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను టెన్షన్ పెడుతుంది. 2023, నవంబర్ 23వ తేదీ సాయంత్రం.. కాన్పూర్ సమీపంలోని బిల్ హౌర్ రైల్వేస్టేషన్ సమీపంలో కాస్ గంజ్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే చైన్ లాగి రైలును ఆపాడు. ఆ వెంటనే ఫైర్ సేఫ్టీ సిలిండర్ తో మంటలను ఆర్పేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నుంచి అన్వర్ గంజ్ వెళుతున్న కాస్ జంగ్ రైలు.. బిల్ హౌర్ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే.. ఓ బోగీ నుంచి మంటలు వచ్చాయి. బోగీ అంతా పొగ వచ్చేసింది. ఓ ప్రయాణికుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం సుభాన్ పూర్ గ్రామానికి దగ్గరలో ఉండటం.. రైలు పట్టాల పక్కనే రోడ్డు మార్గం ఉండటంతో ప్రయాణికులు అందరూ రైలు నుంచి దూకేసి.. రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. 

విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు స్పాట్ కు వచ్చారు. చిన్న ప్రమాదమే అని.. ఎవరూ గాయపడలేదని ప్రకటించారు. ప్రమాదం జరిగిన బోగీని తప్పించి.. మరో బోగీ ఏర్పాటు చేసి.. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతామని వెల్లడించారు అధికారులు. మంటలకు కారణాలపై దర్యాప్తు చేస్తామని వివరించారు అధికారులు. ప్రమాదంలో ఎవరికీ ఎలా హాని జరగలేదని స్పష్టంగా తెలపటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఓ ప్రయాణికుడి సమయస్ఫూర్తి కారణంగా పెను ప్రమాదం తప్పింది అంటున్నారు మిగతా ప్రయాణికులు.