రేవంత్ చెప్పే  శకుని ఎవరు? : కవిత

 రేవంత్ చెప్పే  శకుని ఎవరు? : కవిత
  • సీఎం తనను తాను ఓ బార్బరీకుడు అనుకుంటుండు: కవిత
  • అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నయ్​
  • డిగ్రీ లెక్చరర్​ పోస్టుల్లో గ్రూప్​ 1 తరహా కుట్రలు  
  • ప్రభుత్వ నియామకాల్లో జీవోలు అడ్డుగా మారుతున్నయని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి తనను తాను రాముడు అనుకుంటున్నారని, కేసీఆర్​ను రావణుడు అంటున్నారని, మరి ఆయన చెప్తున్న శకుని ఎవరో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. తనను తాను బార్బరీకుడు అనుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం ఆమె జాగృతి ఆఫీసులో మీడియాతో చిట్​చాట్​, ప్రెస్​కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందని, ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారని అన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​ భుజాన తూపాకీ పెట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాల్చారన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, దానికోసం పోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్​లో ఉన్నారన్నారు. ఎవరనేది సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానన్నారు. తమతో మాజీ మావోయిస్టులు కూడా కలసి వస్తారని, వారిది, తమది ఒకటే ఎజెండా అని చెప్పారు. పార్టీ ఏర్పాటు రోజు ఎజెండాకే ప్రాధాన్యమిస్తామని, ఉమాభారతి సహా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పారు. పార్టీలో యువతకే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. 

డిగ్రీ లెక్చరర్​ పోస్టుల్లో కుట్రలు

గ్రూప్​1లాగానే డిగ్రీ లెక్చరర్​ పోస్టులనూ తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ వేసినా దానికి ఒక జీవో అడ్డంకిగా మారిందన్నారు. ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం వేసిన నోటిఫికేషన్ కు అడ్డుగా జీవో నంబర్ 4  తెచ్చారని విమర్శించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ లెక్చరర్ల పోస్టుల నియామకాల్లో కుట్ర జరుగుతున్నదని చెప్పారు. గ్రూప్-1 లో తాము అనుకున్న వారికే ఉద్యోగాలు దక్కేలా ప్రత్యేక ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి కుట్ర చేశారని గుర్తు చేశారు. డిగ్రీ లెక్చరర్ల భర్తీ విషయంలోనూ అదే జరుగుతున్నదన్నారు. అందులో భాగంగానే జీవో నంబర్ 4తో పాటు పీహెచ్​డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకి పది మార్కులంటూ నిబంధనలు తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

అసలు పీహెచ్​డీ అడ్మిషన్లే లేకుండా 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ మూడేండ్లుగా నిర్వహించకపోవడంతో ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నదన్నారు. ఇక, ప్రతీ ప్రభుత్వ కొలువుకూ ఏదో ఒక జీవో అడ్డంకిగా మారుతున్నదన్నారు. డీఎస్సీకి జీవో 104, గ్రూప్స్ కు జీవో 29, పోలీసు ఉద్యోగాలకు జీవో 46, గురుకులాలకు జీవో 81, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా జీవో 4ను తెచ్చారని ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితే నమ్మరని రాహుల్ గాంధీతోనే నిరుద్యోగులకు హామీ ఇప్పించారని గుర్తుచేశారు. తొక్కుకుంటూ పైకి వచ్చానని చెప్పే రేవంత్​ రెడ్డి.. ఇప్పుడు నిరుద్యోగుల తలలపైకి ఎక్కి తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.