కొడుకు రాజ్యాన్ని ఏలాలనే దురాలోచనతోనే కుట్రలు

కొడుకు రాజ్యాన్ని ఏలాలనే దురాలోచనతోనే కుట్రలు
  • కడియం..కేసీఆర్​ గడీల దగ్గర పెద్ద జీతగాడు
  • ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ  

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: తన కొడుకు రాజ్యాన్ని ఏలాలనే దురాలోచనతోనే సీఎం కేసీఆర్​ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఏప్రిల్​4న నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక రాష్ట్ర సదస్సును స్టేషన్​ఘన్​పూర్​లోని జాఫర్​గఢ్​ రోడ్డులో ఉన్న పద్మావతి కన్వెన్షన్​ హాల్​లో ఎమ్మార్పీఎస్​ జిల్లా ఇన్​చార్జి ఇనుముల నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. దీనికి మందకృష్ణ మాదిగ చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 2023లో కేసీఆర్​ రాజకీయ సమాధి కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్​ ఏనాడు అంబేద్కర్​ను గౌరవించలేదన్నారు. కేసీఆర్​కు మద్దతుగా కడియం శ్రీహరి మాట్లాడి దళితులకు ద్రోహం చేశాడన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్​మెంట్​తో దళిత ద్రోహి అని తేలిపోయిందన్నారు. కేసీఆర్​ గడీల దగ్గర పెద్ద జీతగాడి లెక్క కడియం పనిచేసుకోవాలని, ఎస్సీ నియోజకవర్గమైన స్టేషన్​ఘన్​పూర్​లోకి రావొద్దన్నారు. సీఎం కేసీఆర్​ దళితులకు చేసిన కుట్రలపై కడియం శ్రీహరికి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్​ విసిరారు. 
అందుకే ప్రశాంత్​కిశోర్​ను తెచ్చిండు: కోదండరాం 
తన నిరంకుశత్వానికి తిరుగుండొద్దనే దుర్మార్గపు ఆలోచనతోనే సీఎం కేసీఆర్​ రాజ్యాంగంపై కుట్రలు చేస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం మండిపడ్డారు. కేసీఆర్​ పనై పోయిందని, ఇది తెలిసే ప్రశాంత్​కిశోర్​ను అద్దెకు తెచ్చుకున్నాడని విమర్శించారు. ప్రశాంత్​ కిశోర్​ పైసల మనిషని, సమాజం గురించి ఆలోచించడన్నారు. 
రాజ్యాంగాన్ని మార్చాలనే భావన వద్దు : ప్రొఫెసర్​ హరగోపాల్
రాజ్యాంగాన్ని మార్చాలని ఓ నేత, హక్కుల వలన దేశం బలహీనపడుతోందని మరో నేత మాట్లాడడం కరెక్ట్​ కాదని ప్రొఫెసర్​ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే భావనను విడనాడాలని సీఎం కేసీఆర్​ను సభా ముఖంగా డిమాండ్​ చేస్తున్నానన్నారు. ప్రొఫెసర్​ జేబీ రాజు, ప్రొఫెసర్​ కాశీం, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​, ఎల్​హెచ్​పీఎస్​ వ్యవస్థాక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్,​ఎమ్మార్పీఎస్​ జాతీయ పొలిట్​బ్యూరో మెంబర్ ​బొడ్డు దయాకర్​, రాష్ట్ర నాయకుడు తిప్పారపు లక్ష్మణ్ , ఎమ్మార్పీఎస్​ ఉమ్మడి జిల్లా లీడర్​ కొయ్యడ మల్లేశ్, జనగామ జిల్లా ఇన్​చార్జి ఇనుముల నర్సయ్య , ఎంఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, మండల అధ్యక్షుడు చాడ ఏలియా పాల్గొన్నారు.