
- ఎక్కువ తీసుకున్న మొత్తానికి మిత్తి కట్టాల్సిందే
- 80 శాతం డ్వాక్రా సంఘాలపై భారం
- రూ.10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న సర్కారు
- ఏడేండ్లుగా అమలులోకి రాని ప్రభుత్వ హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. వడ్డీ లేని రుణం రూ.5 లక్షలకు మించితే.. మిగతా లోన్‌కు సర్కార్ వడ్డీ చెల్లించడం లేదు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్న కేసీఆర్.. ఏడేళ్లయినా ఆ హామీని నెరవేర్చడం లేదు. దీంతో రూ.5 లక్షలు దాటి ఎంత లోన్ తీసుకున్నా.. ఆ మొత్తానికి వడ్డీ భారాన్ని మహిళలే భరించాల్సి వస్తోంది.
రూ.5 లక్షల పైన రుణాలే ఎక్కువ
రాష్ట్రంలో 4.9 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల్లో(ఎస్‌హెచ్‌జీ) సుమారు 49 లక్షల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో 3,79,406 గ్రూపులకు రూ.12,046.39 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. రెండు, మూడేళ్ల సీనియారిటీ ఉన్న సంఘాలకు రూ.5 లక్షల వరకు, అంతకంటే ఎక్కువ సీనియారిటీ ఉండి పాత లోన్ కిస్తీలు రెగ్యులర్‌గా చెల్లించిన సంఘాలకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండానే రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 80 శాతం సంఘాలు ఐదారేళ్లపైన సీనియారిటీ ఉన్నవే. ఈ సంఘాలన్నీ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు అర్హత కలిగినవే. దీంతో ఈ సంఘాలన్నీ రూ.5 లక్షలపైనే లోన్స్ తీసుకున్నాయి. వీరంతా ప్రతినెల అసలు, వడ్డీ కలిపి బ్యాంకుల్లో చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.5 లక్షల్లోపు రుణాలకే వడ్డీ లెక్కకడుతోంది. మిగతా భారం మహిళా సంఘాలపై పడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షల వరకు వడ్డీని ప్రభుత్వమే భరించాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.