కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని రెండేళ్ల నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రజా సమస్యలపై పోరాడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అయిలయ్య విమర్శించారు.  ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించడం కోసం మంగళవారం యాదగిరిగుట్టలో డీసీసీ చీఫ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో.. పార్టీని కాపాడుకోవడం కోసం కేసీఆర్ పాకులాడుతున్నారని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.  

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత సోమవారం కేసీఆర్ బయటికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు మాట్లాడితే.. బీఆర్ఎస్ నాయకులు సంబరపడటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో అభివృద్ధి షురూ అయిందన్నారు. స్టేట్ విమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, సైదాపురం ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, కాంగ్రెస్ సర్పంచులు పాల్గొన్నారు.