- ఖమ్మం అడిషనల్కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
- కొనుగోలుపై మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యంతో సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని ఖమ్మం అడిషనల్కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 242 మంది రైతుల నుంచి 478 మెట్రిక్ టన్నుల పత్తి ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 6న బంద్ పాటిస్తున్న నేపథ్యంలో రైతులు యాప్ లో నవంబర్ 6న పత్తి అమ్మకం కోసం సీసీఐ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని, ఖమ్మం, ఏన్కూరు మార్కెట్ యార్డులకు కూడా పత్తి తీసుకురావొద్దని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బి. గంగారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీలు, కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు, సీసీఐ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ ఏడీఏ వాసవి రాణి, ఆరెంపుల జీఆర్ఆర్ కాటన్ ఇండస్ట్రీస్ గోడవర్తి శ్రీనివాస్, తిరుమలాయ పాలెం శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ మిల్ కృష్ణమూర్తి, తల్లాడ స్టేబుల్ రిచ్ కాటన్ ఇండస్ట్రీస్ దర్గయ్య, మధిర మంజిత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రాందేవ్ శర్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఇండ్లు కేటాయించాం..
ఆన్ లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించామని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా అలాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాట్ మెంట్ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఆర్ఐ వహీద్, ఈడీఎం దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
