- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దినపత్రికల్లో ప్రచురితమవుతున్న వ్యతిరేక వార్తలకు సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. 83 వ్యతిరేక వార్తలకు వివిధ శాఖల నుంచి తీసుకున్న చర్యలపై వారంలోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన 201 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వచ్చే శనివారంలోగా దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. మంత్రుల నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి వివిధ శాఖల నుంచి 152 దరఖాస్తులు రాగా, అందులో 21 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.
పరిష్కారం కానీ సమస్యలుంటే కారణం తెలుపుతూ తిరస్కరించాలని చెప్పారు. సీఎం ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సహేతుకంగా, న్యాయబద్ధంగా చేపట్టాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది హాజరు శాతంపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. రోజువారీ హాజరును గ్రూప్ లో పోస్ట్ చేయాలని చెప్పారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలును మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, డీఆర్డీవో ఎన్.సన్యాసయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ లాభసాటి పంట..
ఆయిల్ పామ్ సాగు లాభసాటి పంట అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా ఉద్యానవన, సహకార శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో సహకార సంఘాల డైరెక్టర్లకు అవగాహన కల్పించారు. మారుతున్న సాంకేతికను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే విధానంపై పలు సూచనలు చేశారు. అంతకుముందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను
ఆదేశించారు.
