
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావి, నేలకొండపల్లి లోని బౌద్ధ స్థూపాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లాను మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ. 29 కోట్లతో చేపడుతున్న ఖిల్లా రోప్ వే నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని చెప్పారు. జాఫర్ బావి, ఖిల్లా అభివృద్దితో ఖమ్మం పర్యాటక పాంతంగా మారుతుందని చెప్పారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. బుద్ధవనంలో పర్యాటకుల బసకు ఏర్పాట్లు చేశామన్నారు.
మ్యూజియం, బౌద్ధ మెడిటేషన్ హాల్, బుద్ధుని జీవిత చరిత్ర తెలిపే శిల్పాలు, మంచి ప్రవేశ ద్వారం డిజైన్ చేయాలని సూచించారు. రెస్టారెంట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్, బాలసముద్రం చెరువులో బోటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక చేయాలని ఆదేశించారు. బౌద్ధ స్థూపానికి బాల సముద్రం చెరువును అనుసంధానం చేసి, అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించవచ్చని చెప్పారు.
కలెక్టర్ వెంట బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సుమన్ చక్రవర్తి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ డిఇ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ అసోసియేట్ చీఫ్ కన్సల్టెంట్ వెంకటేశ్, అధికారులు, తదితరులు ఉన్నారు.
దరఖాస్తుల పరిష్కారించాలి
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను ఈనెల 15 లోపు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 75 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో సాదా బైనామాకు సంబంధించి ఉన్న 49 వేల దరఖాస్తులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.
సాదా బైనామా మినహాయించి పెండింగ్ ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 10 శాతం దరఖాస్తులను జిల్లా స్థాయిలో ర్యాండమ్ గా చెక్ చేస్తామని, భూ భారతి చట్టం నిబంధనలు పాటించని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తులన్నీ పరిష్కారం అయ్యే వరకు రెవెన్యూ సిబ్బంది సెలవులు తీసుకోవద్దని సూచించారు. అంతకుముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దశల్లో పురోగతిలో ఉన్న 655 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఏన్కూరు లో 40 ఇండ్లను లబ్ధిదారులు ఆక్రమించారని, దీనిపై నివేదిక అందించాలని తహసీల్దార్ ను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.