
- ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రోత్సాహం
- పీడీ, పీఈటీ, కోచ్ ల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో పాఠశాల క్రీడల నిర్వహణపై ఈటీ, కోచ్ లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల క్రీడలపై ఆసక్తి తగ్గిందన్నారు. విద్యార్థులు ఫిజికల్ ఫిట్నెస్ తో ఉండటానికి క్రీడలు అవసరమన్నారు. జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, డంబెల్స్, ఇతర క్రీడా పరికరాలను పంపిణీ చేశామని చెప్పారు.
పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థలం, గ్రౌండ్ లెవెలింగ్ స్థానిక సంస్థల సహకారంతో చేపట్టాలన్నారు. జిల్లాలో క్లస్టర్, మండల స్థాయిలలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని, పిల్లల మధ్యలో స్నేహ పూర్వక పోటీ పెరిగేలా చూడాలని చెప్పారు. క్రీడా పోటీల్లో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్టేడియంలో ప్రత్యేక శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల వారీగా క్రీడల నిర్వహణకు టైం టేబుల్ తయారు చేయాలని, ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడా శాఖాధికారి సునీల్ రెడ్డి, పీడీలు, పీఈటీలు, స్పోర్ట్స్ స్టేడియం కోచ్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నగరాన్ని శుభ్రంగా ఉంచాలి
ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, ప్రజలు స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నగరంలోని 57వ డివిజన్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ డాక్టర్. పి. శ్రీజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రమణగుట్ట, వికలాంగుల కాలనీ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, సైడ్ కాలువలు, డ్రైనేజీ, రోడ్లు, ఖాళీ ప్రాంతాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ ప్రాంతాల్లో నిలిచిన మురుగు నీటి పరిస్థితులను చూసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.
వికలాంగుల కాలనీలో శిథిలావస్ధలో ఉన్న బాలకార్మిక ప్రత్యేక పాఠశాలను పరిశీలించారు. అక్కడే ఉన్న ఇంగ్గీష్ మీడియం ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించి ఆధునిక సౌకర్యాలతో ప్లే స్కూల్, ఆంగన్వాడీ కేంద్రం, పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయడానికి, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలోని స్థానిక పిల్లలకు విద్యా బోధనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక కార్పొరేటర్ రఫిదా బేగం ముస్తఫా, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్భన్ మండల తహసీల్దార్ సైదులు ఉన్నారు.