వరద ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వరద ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి
  • మధిరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి

మధిర, వెలుగు : --వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఆయన పర్యటించారు. హనుమాన్ కాలనీ, ముస్లిం కాలనీలను కాలినడకన తిరుగుతూ వరద ప్రభావ పరిస్థితులపై ప్రజలతో మాట్లాడుతూ పలు విషయాలపై ఆరా తీశారు.

 లోతట్టు ప్రాంతాల వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి టౌన్ మ్యాప్ లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.  స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్డు వెడల్పు పెంచాలని, ప్రజలందరూ సహకరిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం మధిర మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ ఆర్ అండ్​బీ, మున్సిపల్ అధికారులతో పట్టణ అభివృద్ధి పనులు, శానిటేషన్, వరద లోతట్టు ప్రాంతాల పరిరక్షణపై సమీక్షించారు.

 లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. మధిర పెద్ద చెరువు ట్యాంకుల ఏర్పాటు, పటిష్ట కాల్వర్టర్ల నిర్మాణం, స్టామ్ వాటర్ సైడ్ డ్రైన్​ లు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వరద నీరు వెళ్లిపోవడానికి మున్సిపల్ అధికారులు రూపొందించిన డ్రైనేజీ ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మం, ఆర్ అండ్​ బీ డీఈ శంకర్, మధిర మండల తహసీల్దార్ రాంబాబు,  మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ తో జరిగిన నష్టం నివేదిక ఇవ్వాలి

ఖమ్మం టౌన్ : క్షేత్రస్థాయి పరిస్థితి ప్రతిబింబించేలా తుఫాన్ నష్టం నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ నష్టం నివేదిక తయారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నివేదిక పారదర్శకంగా ఉండాలని, ఎక్కడ కూడా ఒక ఫిగర్ తప్పు ఉండటానికి వీలు లేదని అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.