
- డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మంచి డిమాండ్
- మూడు నెలల కింద వైరా రోడ్డులో ప్రారంభం
- వీకెండ్ లో రూ.45 వేలు, రోజుకు రూ.35 వేల వ్యాపారం
- మధిర , సత్తుపల్లి లాంటి పట్టణాలకు విస్తరించే ప్లాన్
- వ్యాపారాభివృద్ధిపై మహిళా సంఘాల దృష్టి
ఖమ్మం, వెలుగు : డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ సూపర్ సక్సెస్ అయింది. షాపింగ్ మాల్ తరహాలో ఖమ్మంలోని వైరా రోడ్డులో దీన్ని ఏర్పాటు చేయగా, క్రమంగా అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మామూలు రోజుల్లో రూ.35 వేలకు పైగా అమ్మకాలు జరుగుతుండగా, వీకెండ్స్ తో పాటు ఇతర పండుగలు, సెలవు రోజుల్లో సేల్స్ రూ.45 వేల వరకు పెరుగుతున్నాయి.
దీంతో మార్ట్ కు ఉత్పత్తులను సప్లయ్ చేస్తున్న సంఘాలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. గతంలో సొంతంగా ఎవరికి వారు తమ ఉత్పత్తులను అమ్ముతున్న సమయంలో అంతంతమాత్రంగా ఉన్న సేల్స్ కాస్తా, ఇప్పుడు నాలుగైదింతలు పెరగడంతో వ్యాపార వృద్ధి పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారు.
పలు రకాల ఉత్పత్తులు
ఖమ్మం జిల్లాలో వందలాది మహిళా సంఘాలు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వాటిని కొందరు సొంతంగా ఇండ్ల దగ్గరే అమ్ముకుంటుండగా, మరికొంత మంది వారాంతపు సంతల్లో అమ్ముతున్నారు. ఇలా ఎవరికి వారుగా వ్యాపారాలు చేస్తుండడం వల్ల వాటికి సరైన బ్రాండింగ్ ఏర్పడడం లేదు. వ్యాపారం కూడా మరింత వృద్ధి కాకపోవడాన్ని గుర్తించిన అప్పటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వాళ్లందరికోసం ఒక షాపింగ్ మాల్ ఏర్పాటుచేయాలని ప్లాన్ చేశారు.
ఆ ఆలోచన మేరకు మేడిన్ ఖమ్మం బ్రాండ్ పేరుతో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఖమ్మంలో మహిళా మార్ట్ ను ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షలతో దీన్ని ఏర్పాటు చేసి, జిల్లాలోని దాదాపు 60కి పైగా మహిళా సంఘాల ఉత్పత్తులను అమ్ముతున్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆరుగురు పొదుపు సంఘాల సభ్యులు కౌంటర్ ద్వారా అమ్మకాలను నిర్వహిస్తున్నారు. సెర్ప్ డీపీఎం రోజువారీ లెక్కలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ రకాల రవ్వలు, పప్పులు, స్నాక్స్, మిల్లెట్స్ తో తయారుచేసిన వంటకాలు, పిండ్లు, బియ్యం, కొయ్య బొమ్మలు, గిఫ్ట్ లు, జూట్ బ్యాగులు, నేచురల్ సబ్బులు, విత్తనాలు, కలంకారీ వస్త్రాలు, మసాలా టీపొడి, సేంద్రీయ ఉత్పత్తులు, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, వెదురు ఉత్పత్తులు అమ్ముతున్నారు.
కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా నాణ్యమైన కొత్త ఉత్పత్తులను చేర్చుతున్నారు. స్టోర్ లో ఉన్న స్టాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు మండల సమాఖ్యల ద్వారా ఆయా సంఘాలకు ఆర్డర్లు ఇస్తున్నారు. స్టోర్ లో వచ్చే ఆదాయాన్ని జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యలు పంచుకొని కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. భవిష్యత్ లో మరింత ఆదాయం పెరిగితే, ఆయా మహిళా సంఘాలకు అవసరాన్ని బట్టి అప్పులు ఇవ్వాలని భావిస్తున్నారు.
నెలకు రూ.లక్ష వ్యాపారం చేస్తున్నాం
మహిళా మార్ట్ ద్వారా మా ఉత్పత్తులకు మంచి వేదిక దొరికింది. మేం మిల్లెట్స్ తో వివిధ రకాల పిండి తయారు చేసి అమ్ముతున్నాం. గతంలో ఇంటి దగ్గర, తెలిసిన వారికి అమ్మడం ద్వారా నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా అమ్మకాలు చేస్తున్నాం. ముడిబియ్యం, మినుములు, బొబ్బెర్లు, పెసర్లు, జొన్నలు, రాగులు, సజ్జలు, మెంతులు వంటి 8 రకాల పిండి కలిపి రెడీ మిక్స్ దోశ పిండి తయారు చేసి అమ్ముతున్నాం.
ఇక గోధుమ పిండి, మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి, జొన్న పిండి, జొన్న రవ్వ, జొన్నలు, రాగులు, సజ్జలు కలిపి మిక్సుడ్ రవ్వ, జొన్న జావ పిండి, రాగిపిండి, సజ్జపిండి, ఇలా చాలా ఉత్పత్తులు నాణ్యంగా తయారు చేస్తున్నాం. వివిధ రకాల వడియాలు, రకరకాల పచ్చళ్లు, ఐదు రకాల కారంపొడులు, మసాలా టీ పొడి కూడా మార్ట్ కు మేం సప్లయ్ చేస్తున్నాం. – కొడవటికంటి లక్ష్మి, ఎంఎల్ఎస్ ప్రొడక్ట్స్, సాయిరాం 1 గ్రూపు, చింతకాని
ఇతర పట్టణాలకు మార్ట్ ను విస్తరించే ఆలోచన చేస్తున్నాం
మహిళా మార్ట్ ద్వారా మంచిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఖమ్మంలో వచ్చిన అనుభవం ద్వారా, భవిష్యత్ లో జిల్లాలోని ఇతర పట్టణాలకు కూడా మార్ట్ ను విస్తరించే ప్లాన్ చేస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘం ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటుపై మంచి స్థలాన్ని అన్వేషిస్తున్నాం. వైరా, సత్తుపల్లిలో మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శాండ్ బజార్ల ఏర్పాటును కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించాం. – అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్