కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను బొందపెడ్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను బొందపెడ్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •      ఎంపీ ఎన్నికల తర్వాత గులాబీ దుకాణం బంద్ 
  •     కవిత జైలుకు పోవడంతో కేసీఆర్​, కేటీఆర్​, హారీశ్​ రావుకు  పిచ్చిపట్టింది
  •     కేసీఆర్.. దోపిడీ సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? 
  •     ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్​

నల్గొండ, వెలుగు:  కాంగ్రెస్​ను టచ్​చేస్తే బీఆర్ఎస్ పార్టీని బొంద పెడ్తామని, ఆ పార్టీ ఆఫీసును పునాదులతో సహా పెకిలిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేసీఆర్ మంగళవారం చేసి​ కామెంట్లకు వెంకట్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. మొన్నటిదాకా కేటీఆర్​ మాట్లాడుతుంటే ఏదో బచ్చాగాడని ఊరుకున్నామని, ఇప్పుడు కేసీఆరే పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ‘ఎన్నికైన ప్రభుత్వం ఏడాదిలో పతనమైతదని ఎట్లా అంటున్నవ్ ? దోపిడీ సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నవా? వార్నింగ్​ఇస్తున్నా.. కాంగ్రెస్​ను టచ్​ చేస్తే నీ పార్టీలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు, నీ బంధువులు తప్ప ఒక్కరు కూడా లేకుండా చేస్తాం’ అని కేసీఆర్​ను వెంకట్​రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో15 ఎంపీ సీట్లు గెలువాలని టార్గెట్​పెట్టుకున్నామని, 12, 13 సీట్లలో కచ్చితంగా కాంగ్రెస్​ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ‘నువ్వు మమ్మల్ని వెంటాడటం కాదు.. మేమే నిన్ను వేటాడుతాం. నువ్వన్నా కట్టె పట్టుకోవాలి.. కానీ మేం కట్టె పట్టుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగనే ఉన్నం. ఎంపీ ఎన్నికలు అయ్యాక నీ దుకాణం బంద్ అయితది’అని కేసీఆర్ ను హెచ్చరించారు. 

కవిత జైలుకు పోయే సరికి పిచ్చి పట్టింది 

‘కవిత జైలుకు పోగానే తండ్రీ కొడుకులకు (కేసీఆర్​, కేటీఆర్​), బామ్మర్ది(హరీశ్​రావు)కి పిచ్చి పట్టినట్టుంది. కవితకు రెండేండ్ల వరకు బెయిల్​ రాదు. ఇగ మేం కూడా జైలుకు పోతమనే భయం వారికి పట్టుకుంది. ఫోన్​ ట్యాపింగ్, యాద్రాది పవర్ ​ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో వారు జైలుకు పోవడం ఖాయం. మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి కూడా జైలుకే. విద్యుత్​ అవినీతి పైన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్​ నర్సింహారెడ్డితో విచారణ జరుగుతోంది.. త్వరలో అందరికీ నోటీసులు అందుతాయి’ అని వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్,​ ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి కుట్ర పన్ని కృష్ణా జలాలను రాయలసీమకు అప్పగించారని విమర్శించారు. కేసీఆర్​సీఎంగా ఉన్నప్పుడే కరువు వచ్చిందని, ఆయన బిడ్డ, కొడుకు చేసిన మోసాలు, పాపాల వల్ల రాష్ట్రంలో కరువు దాపురించిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రూ.7 లక్షల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తున్నదని, బీఆర్ఎస్​ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కేసీఆర్​ రూ. 35 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయిండని అన్నారు.

కేసీఆర్​.. దరిద్రమైన పాలన చేసినవ్ 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, దోపిడీ పైన విచారణ చేయిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఇందులో అన్ని కంటే పెద్దది ఫోన్ ట్యాపింగ్ అని, వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. భార్య భర్తలు మాట్లాడుకున్నవి కూడా ఫోన్​ ట్యాప్​ చేసి విన్నారని అన్నారు. ‘ ప్రణీత్​రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్​రావు, నీ చుట్టాలను పెట్టుకుని దేశంలో ఎక్కడా లేనివిధంగా దరిద్రమైన పాలన చేశావ్​’ అని కేసీఆర్​పై ధ్వజమెత్తారు. రేవంత్​ రెడ్డి ముఖం చూస్తే చిన్న బోయిందని కేసీఆర్​ అంటున్నాడని, రేవంత్ ​ముఖం చూసే ధైర్యం లేకనే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్​ దొంగలాగా తప్పించుకున్నాడని విమర్శించారు. బతుకమ్మ చాటున మందుబాటిళ్లు అమ్మినోళ్లకు ఎవరైనా ఓట్లు వేస్తరా? అని చురకలంటించారు. లిక్కర్​ స్కాంలో సూత్రధారి, పాత్రధారి కవితే అని చెప్పాక కూడా కేసీఆర్​కు ఎట్లా సిగ్గు వస్తలేదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్​, కేటీఆర్​ జైలుకు పోతారు.. ప్రభాకర్​రావు నుంచి మొదలు పెడితే తారక రామారావు వరకు రావులంతా జైలుకు పోతే రేవంత్​ చెప్పినట్టు చర్లపల్లి జైలులో ఒక్క డబుల్ బెడ్​ రూమ్ ఇల్లు చాలదు.. చర్లపల్లి, చంచల్​గూడ జైలులో ఇంకొన్ని డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు కట్టాల్సి వస్తది’అని వెంకట్​రెడ్డి చురకలంటించారు.