అర్హులైన ప్రతిఒక్కరికీ మూడేండ్లలో ఇందిరమ్మ ఇల్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి

అర్హులైన ప్రతిఒక్కరికీ మూడేండ్లలో ఇందిరమ్మ ఇల్లు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి వెల్లడి

నల్గొండ, వెలుగు : ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడేండ్లలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌‌‌‌ కార్డు అందజేస్తాం, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం, అందుకే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాభివృద్ధిలో భాగంగానే యంగ్‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌తో పాటు తెలంగాణ మోడల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మిస్తున్నామని, స్టూడెంట్ల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎల్‌‌‌‌కేజీ నుంచి ఇంటర్‌‌‌‌ వరకు స్టూడెంట్లకు ప్రతిరోజు బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ ఇచ్చేలా కొత్త పథకాన్ని కూడా అమలు చేయనున్నామన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు అందిస్తున్నామని చెప్పారు.

రైతులు సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. మధ్యలోనే ఆగిపోయిన ఇండ్లకు నిధులు మంజూరు చేయిస్తామని, నెల రోజుల్లో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌‌‌‌ను ఆదేశించారు. వంద డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల గృహప్రవేశాల కోసం తాను సొంతంగా ప్రతి ఇంటికి రు.20 వేలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తిప్పర్తి మండల కేంద్రానికి త్వరలోనే సీఎంను తీసుకురానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ బి. చంద్రశేఖర్, సర్పంచ్ రజిత, అడిషనల్‌‌‌‌ కలెక్టర్ వై. అశోక్‌‌‌‌రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్‌‌‌‌కరణ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.