కేజీ టు పీజీ అని మేం మోసం చేయం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేజీ టు పీజీ అని మేం మోసం చేయం :  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • మా సర్కార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తది: కోమటిరెడ్డి 
  • టీచర్ ఫర్ చేంజ్ ట్రస్ట్’ కార్యక్రమంలో మంత్రి స్పీచ్ 

హైదరాబాద్, వెలుగు: విలువలతో కూడిన సమాజం ఏర్పాడాలన్నా, సొసైటీలో మార్పు రావాలన్న ఎడ్యుకేషన్ తోనే సాధ్యమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన “టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్” సంస్థ మేనేజింగ్ ట్రస్టీ మంచు లక్ష్మి, మరో ట్రస్టీ మంచు మనోజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రతి బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత సర్కారు మాదిరిగా కేజీ టు పీజీ ఉచిత విద్య అని తాము మోసం చేయబోమన్నారు. పదేండ్లలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి అధికార పార్టీ నేతలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకునేలా గత పాలకులు వారికి మేలు చేశారని మండిపడ్డారు. 

యూనివర్సిటీల వీసీలను కూడా తమ పార్టీకి మద్దతుగా ఉండే వారిని, మంత్రులు, అధికార పార్టీ నేతల బంధువులను నియమించుకున్నారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు వీలుగా బడ్జెట్ లో రూ. 21 వేల కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం విద్యాహక్కు చట్టం స్పూర్తికి తూట్లు పొడిచి కార్పొరేట్ విద్యాసంస్థలకు వంతపాడిందన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యకు పూర్వవైభవం తెస్తామన్నారు. “టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్” పట్టణ ప్రాంతాల్లోని ప్రైమరీ స్కూల్స్ కు శిక్షణ పొందిన వాలంటీర్లను, గ్రామీణ బడులకు స్మార్ట్ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లను అందిస్తూ గొప్పగా కృషి చేస్తోందని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, చాముండేశ్వరీ నాథ్ తదితరులు పాల్గొన్నారు.